Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆరోపణ
- మలక్‌పేట ప్రభుత్వాస్పత్రిలో ఘటన
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఒకే రోజు ఇద్దరు బాలింతలు మృతిచెందారు.. వారి మృతికి కారణం హైదరాబాద్ మలక్‌పేట ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమేనని బంధువులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన మహేష్ భార్య సిరివెన్నెలతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. సిరివెన్నెల కాన్పు కోసం ఈనెల 9న మలక్‌పేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేరింది. 11న ఆమెకు డెలివరీ కాగా.. 12వ తేదీన అస్వస్థతకు గురైంది. దాంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయింది. ఇదిలా ఉండగా, తిరుపతికి చెందిన జగదీశ్ భార్య శివాని ఈనెల 10న మలక్‌పేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేరగా 11న డెలివరీ అయింది. అయితే, 12వ తేదీన ఆమె అస్వస్థతకు గురైంది. దాంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి మృతిచెందింది. ఇద్దరు బాలింతలు మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు మలక్‌పేట ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వారు చనిపోయినట్టు ఆరోపించారు. వైద్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తక్షణమే దీనిపై డీఎంహెచ్ఓ, కలెక్టర్, సంబంధిత అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన వైద్యులను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనపై ఆస్పత్రి డీసీహెచ్ఎస్ సునీత స్పందించారు. బాలింతలకు చికిత్స విషయంలో వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని చెప్పారు. విచారణ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుంటామన్నారు.