Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూ డా.బి.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీ
- పలు విభాగాల్లో పరిశోధనకు పెద్దన్న పాత్ర
- పోటీ పరీక్షలకు పెట్టింది పేరు
- చరిత్రను, సామాజికతను ప్రస్ఫుటించే పుస్తకాల డిజిటలైౖజేషన్
- 60 వసంతాలు పూర్తి చేసుకున్న గ్రంథాలయం
నవతెలంగాణ-ఓయూ
దక్షిణ భారతదేశంలో అతి పురాతన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయం ఓయూ. ఐదో నిజాం రాజు ''మీర్ ఉస్మాన్ అలీఖాన్'' కాలంలో నిర్మించిన యూనివర్సిటీ. లక్షలాది మంది మేధావులను ప్రపంచానికి అందించిన మన పోరుగడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఈ వర్సిటీకి ఇంతటి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడంలో విజ్ఞాన భాండాగారం డా.బి.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ గ్రంథాలయం కీలక భూమిక పోషిస్తోంది. రాజసౌధాన్ని తలపించే వర్సిటీ.. చారిత్రక సంపదను, విజ్ఞానాన్ని పంచుతూ ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఓయూ విశ్వవిద్యాలయం లైబ్రరీ పాత్ర కీలకమైంది. రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించిన కీలకమైన విధానాలు పురుడు పోసుకునేది ఇక్కడే. ఇంతటి గొప్ప పేరు ప్రఖ్యాతలుగాంచిన ఈ గ్రంథాలయం 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ''నవ తెలంగాణ'' ప్రత్యేక కథనం. 1918 నుంచి ఓయూలో గ్రంథాలయ సేవలు ఉన్నప్పటికీ ప్రధాన గ్రంథాలయం సేవలు 1963 ఆగస్టు 3న ప్రారంభమయ్యాయి. నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ గ్రంథాలయాన్ని వర్సిటీలోని పలు విభాగాల విద్యార్థులకు, పరిశోధకులకు ఉపయోగపడేలా ఏర్పాటు చేశారు.
ఆయా విభాగాల ఆధారంగా సేవలు
వర్సిటీలోని ఆయా విభాగాల ఆధారంగా లైబ్రరీ పలు సేవలు అందిస్తున్నది. ప్రధానంగా ఆర్డరింగ్, టెక్నికల్ స్పాట్ పిరియాడికల్ ఇంటర్నెట్ థీసిస్, సీఈఆర్ఎల్ (1997), యూస్ సెక్షన్(1968), మాన్యుస్క్రిప్ట్‌లు, విజన్ ఆఫ్ ఓయూ తదితర విభాగాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ లైబ్రరీలో నాలెడ్జ్ సర్క్యులేషన్, రిఫరెన్స్, డిజిటల్ లైబ్రరీ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనిలో భాగంగానే విజన్ ఆఫ్ ఓయూ కంప్యూటర్ ల్యాబ్‌ను నాటి ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎస్.సత్యనారాయణ హయాంలో ప్రారంభించారు.
నిరంతరం సేవలు
విద్యార్థుల అవసరాలకు తగిన విధంగా ఓయూ లైబ్రరీలో మరిన్ని సేవలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే విద్యార్థులు చదువుకోవడానికి 14 గంటలు సేవలు అందిస్తున్నది. ఈ సౌకర్యాన్ని 2015లో నాటి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్‌కుమార్ అందుబాటులోకి తీసుకొచ్చారు. పోటీ పరీక్షల దృష్ట్యా ఈ సేవలను తీసుకొచ్చారు. ఈ లైబ్రరీతోపాటు ఓయూలో పలు విభాగాల కళాశాలల్లోనూ గ్రంథాలయాలు ఉన్నాయి. వర్సిటీలో ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్, మేనేజ్మెంట్ అండ్ కామర్స్ తదితర గ్రంథాలయాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అన్నింటికీ మూలాధారం ఓయూ ప్రధాన గ్రంథాలయమే. ఏడాదిలో ప్రధాన పండుగలు మినహా అన్ని రోజులూ తెరిచే ఉంటుంది. ఇక్కడ ఉద్యోగులు నిరంతరం సేవలు అందిస్తున్నారు.
విద్యార్థులకు సౌకర్యంగా ల్యాబ్
విద్యార్థులకు వారి పాఠ్యాంశాలతోపాటు వివిధ అంశాలపై విజ్ఞానం పెంచేలా ఇక్కడ పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. నిరంతరం విజ్ఞానాన్ని ఆధునీకరిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రధాన పుస్తకాలను డిజిటలైజేషన్ చేస్తున్నారు. పురాతన పుస్తకాలను ఆధునీకరించి జాగ్రత్త పరుస్తున్నారు. ఇక్కడ గ్రంథాలయంలో 25 కంప్యూటర్లతో కూడిన అత్యాధునిక ల్యాబ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎప్పటికప్పుడూ సమాచారాన్ని అందిపుచ్చుకోవడానికి ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో..
ఈ గ్రంథాలయంలో ప్రధానంగా పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువుగా అందుబాటులో ఉంచారు. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు ప్రచురితమైన అన్ని రకాల పుస్తకాలను సేకరించి భద్రపరిచారు. పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాంపిటీషన్ రెఫరెన్స్ సెల్లో వీటిని పొందుపరిచారు. ఇది రోజూ రాత్రి 11 గంటల వరకు పనిచేస్తుంది.
ఆధునిక దేవాలయం మా గ్రంథాలయం
గ్రంథపాలకుడు డా.ఎ.ఎస్.చక్రవర్తి
స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ఈ గ్రంథాలయం ప్రధాన భూమిక పోషించింది. ఎంతోమంది జీవితాలకు దిశా నిర్ధేశం చేసిన ఘనత మా గ్రంథాలయానిది. ఆధునిక దేవాలయం మా గ్రంథాలయం. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా గ్రంథాలయంలో అనేక మార్పులు చేర్పులు తీసుకొచ్చాం. వారి ఉపాధియే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇప్పటి వరకు 45వేల పుస్తకాలను డిజిటలైజ్ చేసి నెట్లో అందుబాటులో ఉంచారు. 6825 మ్యాన్ స్క్రిప్టు, 10, 11వ శతాబ్దాలకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలను డిజిటలైజేషన్ చేశాం. ఆల్ మజీద్ సెంటర్ ఫర్ హెరిటేజ్ అండ్ కల్చర్ (దుబారు) సహకారంతో డిజిటలైజేషన్ పూర్తి చేశాం.
ఇక్కడ ఉన్న పుస్తకాల వివరాలు
పుస్తకాలు :- 5,57,007
థిసెస్, ఎంఫిల్ :- 75387
ఐరాస పత్రాలు :- 13195
మాన్యుస్క్రిప్ట్, తాళపత్ర గ్రంథాలు -6825
ఐలిమ్స్ :- 273
సీడీ రోమ్స్ :-12
డిజిటలైజేషన్ డాక్యుమెంట్స్ :-45,000