Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేళ్లలో రోడ్డున పడ్డ ఉద్యోగులు
- కొత్త నియామకాలపై నీలినీడలు
హైదరాబాద్ : భారత టెక్ కంపెనీల్లో వేల ఉద్యోగాలు ఊడుతున్నాయి. గడిచిన రెండు ఏళ్లలోనే దాదాపు 30,000 మంది పైగా ఉద్యోగులను టెక్ కంపెనీలు తొలగించాయని అంచనా. కరోనా సంక్షోభానికి తోడు ఆర్థిక వ్యవస్థలో మందగమనం నేపథ్యంలో అనేక పెద్ద కంపెనీలు, స్టార్టప్‌లు సిబ్బందిని తొలగించడంతో పాటు కొత్త నియామకాలను స్తంబింపజేశాయి. ఈ విషయాన్ని 2019 నుంచి టెక్ ఉద్యోగుల తొలగింపునపై అధ్యయనం చేస్తున్న ఆన్లైన్ వేదిక లేఆఫ్స్.ఎఫ్‌వైఐ ఓ రిపోర్టులో వెల్లడించింది. ఆ వివరాలు.. 2020-2022 మధ్య కాలంలో ఓలా దాదాపు 2600 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ క్యాబ్ అగ్రిగేటర్ వేదిక మే 2020లో 1,400 ఉద్యోగాలను లేదా 35 శాతం సిబ్బందికి కోత పెట్టింది. తాజాగా పునర్వ్యవస్థీకరణ పేరుతో మరో 200 మందిని ఇంటికి పంపించింది.
ఎడ్టెక్ కంపెనీ బైజూస్ గత రెండేళ్లలో 2,500 మందికి ఉద్వాసన పలికింది. ఉత్పత్తి, కంటెంట్, మీడియా, సాంకేతిక బందాల్లోని వారిని ఎక్కువ తొలగించింది. తిరువనంతపురంలోని టెక్నోపార్క్‌లోని తన కార్యాలయాన్ని కంపెనీ మూసివేయగా.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని.. బైజూస్ యాజమాన్యంపై ఒత్తిడి తేవడంతో తిరిగి అక్కడి ఉద్యోగులను వెనక్కి తీసుకుంది. మరో ఎడ్టెక్ కంపెనీ వైట్‌హాట్ జెఆర్ కూడా అధిక తొలగింపులు ఉన్న కంపెనీల జాబితాలో ఉంది. 2020-2022 మధ్య కాలంలో ఈ సంస్థ భారత్‌లోని తమ 2,100 ఉద్యోగులను తగ్గించినట్లు ప్రకటించింది. గౌరవ్ ముంజాల్ యొక్క అన్కాడెమీ గత రెండేళ్లలో 1,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తొలి రౌండ్లో 2020లో 1,100 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. అదే సంవత్సరం జూలైలో రెండో రౌండ్లో మరో 350 మంది ఉద్యోగుల తొలగింపునకు పాల్పడింది. గత రెండేళ్లలో ఈ సంఖ్య 2,250కి చేరుకుంది. కరోనా దెబ్బతో ఓయో కంపెనీ 2019 నుంచి భారత్, చైనాలో తమ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది. గత నెలలో ఒక నివేదికలో కంపెనీ సేల్స్ విభాగంలో 250 మంది ఉద్యోగులను నియమించుకోవాలని పేర్కొన్నప్పటికీ.. మరోవైపు టెక్నాలజీ బృందంలోని 600 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. ఇటీవల అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 18,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటిం చింది. ఇందులో చాలా మందే భారత్‌కకు చెందిన వారు ఉన్నారని పలు రిపోర్టు పేర్కొంటున్నాయి. తొలగింపులపై కంపెనీ ఉద్యోగులకు ఇమెయిల్‌లు పంపడం ప్రారంభించినట్లు సమాచారం. ఇంతక్రితం ఈ సంస్థ భారత్‌లో వెయ్యి మంది ఉద్యోగులను పక్కన పెట్టింది. గడిచిన రెండేళ్లలో వేదాంతు, క్యూర్‌ఫిట్, మేక్మైట్రిప్, మీషో తదితర టెక్ కంపెనీలు వరుసగా 1,100, 920, 700, 650 చొప్పున ఉద్యోగులను తొలగించాయి. జొమాటో 620 మందిని, ఉబెర్, ఉడాన్‌లు వరుసగా 600, 530 మంది చొప్పున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
కొత్త నియామకాలకు దిగ్గజాల వెనుకడుగు
బెంగళూరు : దేశంలోని దిగ్గజ టెక్ కంపెనీలు నూతన నియామకాలపై వేచి చూసే దోరణీని అవలంభిస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా 2022 డిసెంబర్ త్రైమాసికంలో అతి తక్కువ నియా మకాలు చేపట్టాయి. గడిచిన ఈ త్రైమాసికంలో టిసిఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ తదితర నాలుగు దిగ్గజ టెక్ కంపెనీలు 5వేల మేర మందిని కొత్తగా తీసుకున్నాయి. ఇంతక్రితం సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ త్రైమాసికంలో కొత్తగా 28,836 ఉద్యోగులను నియమించుకున్నాయి. ఇది మొదటి త్రైమాసికంలో ఆ కంపెనీలు జోడించిన దానిలో సగం కావడం గమనార్హం. గడిచిన డిసెంబర్ త్రైమాసికంలో దేశంలో టాప్ ఐటి కంపెనీ టిసిఎస్ కొత్తగా 2,197 మందిని, విప్రో 500 మందిని, ఇన్ఫోసిస్ 1600, హెచ్‌సిఎల్ 2,945 చొప్పున ఉద్యోగులను మాత్రమే తీసుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని ఐటి కంపెనీలు నూతన నియామకాల పట్ల వేచి చూసే దోరణీలో ఉన్నాయని ఆ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.