Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో నిధులు కేటాయించాలి : కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి సహకరించాలని పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన కేంద్రానికి లేఖ రాశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరించడమంటే దేశానికి సహకరించినట్టేనని తెలిపారు. కేవలం ఎనిమిదేండ్ల ప్రగతి ప్రస్థానంతోనే దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకంగా మారిందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక మౌలిక వసతులను తెలంగాణ అభివృద్ధి చేస్తున్నదనీ, వీటికి జాతీయ ప్రాధాన్యత ఉన్నదని తెలిపారు. పారిశ్రామిక రంగంలో చేపట్టిన కార్యక్రమాలకు ఈ ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి, నిబద్ధతను చాటుకోవడానికి బడ్జెట్ మంచి సందర్భమని సూచించారు. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు. వివిధ శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయాన్ని ఆయన గుర్తుచేశారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్‌తో పాటు ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్ ఫార్మా క్లస్టర్ హైదరాబాద్ ఫార్మాసిటీ వంటి వాటికి భారీగా మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్ వంటి నినాదాలు, విధానాలను బలంగా నమ్మితే, వాటిని నిజం చేయగలిగే శక్తి కలిగిన తెలంగాణ వంటి అభివృద్ధికాముక రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహి ంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గత ఎనిమిదేండ్లుగా ప్రతి బడ్జెట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రోత్సాహకంగా దక్కాల్సిన నిధులపై విజ్ఞప్తులు చేస్తున్నా ఆర్థిక సహాయమేమి అందలేదనీ, చివరి బడ్జెట్లో నైనా సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్‌లో ఏర్పాటుచేస్తున్న నిమ్జ్ ప్రాజెక్టు వ్యయం అంచనాలు రూ.9,500 కోట్లనీ, అందులో మౌలిక వసతుల కల్పన కోసం కనీసం రూ.500 కోట్లు కేటాయించాలని కోరారు. హైదరాబాద్ ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్ రెండు నోడ్స్‌కు రూ.ఐదు వేల కోట్లు అవసరమవుతాయనీ, అందులో కనీసం 50 శాతాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన నోడ్స్ హుజూరాబాద్, జడ్చర్ల, గద్వాల, కొత్తకొటలకు రూ.ఐదు వేల కోట్లు అవుతుండగా, అందులో కనీసం రూ.1,500 ఈ ఏడాది వెచ్చిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. టీఐఇఎస్ పథకం కింద జడ్చర్ల ఇండిస్టియల్ పార్కులో కామన్ ఎప్లూయెంట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ (సీఇటీపీ) ఏర్పాటు కోసం గ్యాస్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్‌లో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్‌ను పునరుద్ధరించాలనీ, హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలనీ, కేంద్రం ఏర్పాటు చేయబోతున్న డిఫెన్స్ ఇండిస్టియల్ ప్రొడక్షన్ కారిడార్‌లో హైదరాబాద్‌ను చేర్చాలనీ, వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ అభివృద్ధికి రూ.500 కోట్లు మూలధనం ఇచ్చేందుకు వీలుందని గుర్తు చేస్తూ, ఈ బడ్జెట్లో రూ.300 కోట్లు ప్రకటించాలని కోరారు.