Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలు విద్యకు దూరం
- విద్యా కేంద్రీకరణ,ప్రయివేటీకరణ, కాషాయీకరణ అత్యంత ప్రమాదం
- ఎన్ఈపీ వద్దే వద్దు.. ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి
- అందుకోసం కేసీఆర్ దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాలి
- 'మన ఊరు-మనబడి'కి నిధులు విడుదల చేయాలి
- టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి డిమాండ్
నాగటి నారాయణ నగర్ (మన్నెగూడ) నుంచి బొల్లె జగదీశ్వర్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యావిధానం (ఎన్ఈపీ)-2020 అమల్లోకి వస్తే పేద విద్యార్థులు విద్యకు దూరమవుతారని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ విధానాన్ని తీసుకురావటం ద్వారా బీజేపీ... దేశంలో అలజడిని సృష్టించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా కేంద్రీకరణ, ప్రయివేటీకరణ, కాషాయీకరణ, కార్పొరేటీకరణ కోసమే ఎన్ఈపీని కేంద్రం తెచ్చిందని విమర్శించారు. దాన్ని రద్దు చేయాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఉన్న సార్థ కన్వెన్షన్ సెంటర్(నాగటి నారాయణ నగర్)లో శుక్రవారం ప్రారంభమైన టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఐదో మహాసభ రెండోరోజైన శనివారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జంగయ్య, చావ రవి మాట్లాడారు. విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై మహాసభలో చర్చించామని వారు వివరించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా, మెజార్టీ మత భావజాల ఉన్మాదాన్ని రెచ్చగొట్టేలా బీజేపీ వ్యవహరిస్తున్నదని చెప్పారు. ఎన్ఈపీతో డ్రాపౌట్స్ పెరుగుతాయని హెచ్చరించారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహించామని వివరించారు. తెలంగాణలో ఎన్ఈపీని అమలు చేస్తారా..? లేదా..? అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేరళ, తమిళనాడు, ఢిల్లీ ప్రభుత్వాలు ఎన్ఈపీని అమలు చేయబోమంటూ స్పష్టం చేశాయని గుర్తు చేశారు. దీనిపై స్పష్టమైన వైఖరి చెప్పని తెలంగాణ ప్రభుత్వం చాపకింద నీరులా ఆ విధానాన్ని అమలు చేస్తున్నదని అన్నారు. ఇప్పటికైనా దాన్ని నిర్ద్వందంగా తిరస్కరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఒక ప్రత్యామ్నాయ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ని వాజ్‌పేయి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందన్నారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చట్టాన్ని బీజేపీ మద్దతుతో యూపీఏ ప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు. అయితే సీపీఎస్ ఉద్యోగులకు సామాజిక భద్రత లేదన్నారు. అది వర్తించే ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబానికి రూ.వెయ్యి, రూ.రెండు వేలు మాత్రమే పెన్షన్ వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజస్థాన్, చత్తీస్ఘడ్, పంజాబ్ ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాయని గుర్తు చేశారు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఓపీఎస్ అమలు చేసేందుకు వీలుగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నదని గుర్తు చేశారు. అందువల్ల మన రాష్ట్రంలోనూ సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని కోరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో సీపీఎస్ రద్దు కోసం దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాలనీ, దానికి ఆయనే నాయకత్వం వహించాలనికోరారు.
ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి..
రాష్ట్రంలో 17 ఏండ్లుగా పర్యవేక్షణ అధికారులు, ఏడేండ్లుగా పదోన్నతులు, ఐదేండ్లుగా బదిలీల్లేక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని జంగయ్య, చావ రవి ఈ సందర్భంగా చెప్పారు. 12 జిల్లాల్లో రెగ్యులర్ డీఈవో పోస్టులున్నా, వాటిలో ఐదింటిని ఇన్‌ఛార్జీలే నెట్టుకొస్తున్నారని వాపో యారు. మిగతా 20 జిల్లాలకు అసలు డీఈవో పోస్టు లే మంజూరు కాలేదని తెలిపారు. ఎంఈవో పోస్టుల కు సంబంధించి 16 పోస్టుల్లోనే రెగ్యులర్ ఎంఈవో లున్నాయనీ, మిగిలిన చోట్ల ఇన్ఛార్జీలు కొనసాగుతు న్నారని వివరించారు. ఉపాధ్యాయ ఖాళీలు, పర్యవేక్షణ లేకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఆయా ఖాళీలను భర్తీ చేయాలనీ, బదిలీలు, పదోన్నతులను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరలోనే పదోన్నతులంటూ విద్యామంత్రి పదేపదే చెప్తున్నారనీ, అది ఎప్పుడని ప్రశ్నించారు.
మాణిక్‌రెడ్డిని గెలిపించాలి..
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న పాపన్నగారి మాణిక్‌రెడ్డిని గెలిపించా లని జంగయ్య, చావ రవి ఉపాధ్యాయు లకు విజ్ఞప్తి చేశారు. విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలు, పీఆర్సీ, 317 జీవో బాధితులకు న్యాయం చేయాలం టూ తమ సంఘం ఆధ్వర్యంలో ఐక్య ఉద్యమాలు నిర్వహించామని గుర్తు చేశారు. 317 జీవో బాధిత ఉపాధ్యాయుల అప్పీళ్లను పరిష్కరించాలనీ, స్పౌజ్ టీచర్ల బదిలీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మాణిక్‌రెడ్డిని గెలిపించుకునేందుకు అంద రూ కృతనిశ్చయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
మన ఊరు-మనబడికి నిధుల కొరత..
మన ఊరు-మనబడి కార్యక్రమానికి సంబం ధించి మూడేండ్లలో రూ.7,289 కోట్లతో 26,067 పాఠశాలలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వారు ఈ సందర్భంగా చెప్పారు. మొదటి విడతలో 9,123 స్కూళ్లలో రూ.3,497.62 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తామంటూ ప్రకటిం చిందన్నారు. అయితే ఇప్పటి వరకు నిధుల కొరత వల్ల పది శాతం బడుల్లోనే పనులు పూర్తయ్యాయని వివరించారు. 30 శాతం పాఠశాలల్లో పనులే ప్రారంభం కాలేదన్నారు. మిగిలిన 70 శాతం బడుల్లో పనులు కొనసాగుతున్నాయని అన్నారు. ఆ కార్యక్రమానికి నిధుల కొరత లేకుండా బడ్జెట్‌ను విడుదల చేసి ప్రస్తుత విద్యాసంవత్సరంలోనే పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించలేదనీ, ఈ నేపథ్యంలో పాఠశాలలను ఊడ్చెదెవరంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాల్టీ సిబ్బందికి ఈ బాధ్యతను అప్పగించినా వారు పాఠశాల ఆవరణను మాత్రమే ఊడుస్తు న్నారని అన్నారు. అంతే తప్ప తరగతి గదులు, టారులెట్లను శుభ్రం చేయడం లేదన్నారు. అందువల్ల తక్షణం స్వచ్ఛ కార్మికులను నియమిం చాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇది సామాజిక సమస్యగా మారుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా తెలుగు మీడియం టీచర్లే రెండు మాధ్యమాలనూ బోధిస్తున్నా రని చెప్పారు. దీంతో వారిపై పని భారం పడుతున్న దని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ మీడియం బోధనకు అదనంగా ఉపాధ్యాయులను నియమిం చాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన ర్లకు మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటి ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మతోన్మాదుల మూకదాడులను అరికట్టాలి...
నిజామాబాద్ జిల్లా కోటగిరిలో ప్రభుత్వ ఉపా ధ్యాయుడు మల్లిఖార్జున్‌పై దాడిని ఖండిస్తున్నామని జంగయ్య, చావ రవి చెప్పారు. టీచర్లపై మతో న్మాదుల మూకదాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 51(హెచ్) ప్రకారం తరగతి గదిలో శాస్త్రీయ దృక్పథాన్ని ఉపాధ్యాయులు పెంపొందించాలని సూచించారు. హేతువాద భావాలను బోధించిన వారిపై దాడులు కొనసాగు తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేజీబీవీల్లో 12 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం బేసిక్ పే ఇవ్వాలని కోరారు. గురుకులాల్లో ఉపాధ్యాయు లపై పనిభారాన్ని తగ్గించాలని సూచించారు. మోడల్ స్కూళ్లలో మూడు వేల మంది సిబ్బందికి పదోన్నతులు, బదిలీలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య కార్డులు నిమ్స్‌లో తప్ప మరెక్కడా పనిచేయడం లేదన్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలనీ, కార్పొరేట్ ఆస్పతుల్లో సైతం అవి చెల్లుబాటయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. విలేకర్ల సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షులు ఈ గాలయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్ నాయక్, వెంకటప్ప, కోశాధికారి జగన్నాథశర్మ, కార్యదర్శులు కిషన్‌చౌహాన్, గణేష్, రఘుపాల్, నర్సింహ్మా తదితరులు పాల్గొన్నారు.