Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం సభపై నేతలకు కేసీఆర్ ఆదేశాలు
- జన సమీకరణపై ప్రతి రోజూ దిశా నిర్దేశం
- మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ,ఎమ్మెల్సీ పల్లాకు పూర్తి బాధ్యతలు
- బీఆర్ఎస్ తొలి సభపై పూర్తిస్థాయి దృష్టి
- సభ తర్వాత మరింత ముమ్మరంగా కార్యాచరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఖమ్మంలో నిర్వహించబోయే బీఆర్ఎస్ సభపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు. ఆ జిల్లాకు చెందిన కొందరు సీనియర్ నేతలు 'కాషాయ తీర్థం' పుచ్చుకోవటానికి రెడీ అవుతున్నారనే వార్తల నేపథ్యంలో ఆ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ఆయన సంసిద్ధమవుతున్నారు. దీంతోపాటు బీజేపీ విధానాలను ఎండగట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ క్రమంలో ఖమ్మంలో ఈనెల 18న నిర్వహించబోయే బీఆర్ఎస్ బహిరంగ సభపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చిన తర్వాత నిర్వహిస్తున్న మొట్ట మొదటి సభ కావటంతో ఆయన ఆ మీటింగ్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇప్పటిదాకా ప్లీనరీలు, బహిరంగ సభలు నిర్వహించిన సందర్భాల్లో లక్ష, రెండు లక్షలు, ఎక్కువలో ఎక్కువగా ఐదు లక్షల మంది జనాన్ని సమీకరించాలంటూ సీఎం పిలుపునివ్వటాన్ని గమనించాం. ఇప్పుడు అందుకు భిన్నంగా ఖమ్మం సభకు పది లక్షల మందిని సమీకరించాలంటూ ఆయన నేతలను ఆదేశించారు. ఇందుకనుగుణంగా మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజరుకుమార్తోపాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి నిర్వహణా బాధ్యతలను ఆయన అప్పగించారు. ఇటీవల ఆ జిల్లాలో చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించటం, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాలేరు నియోజకవర్గంలో ఆఫీసును ఏర్పాటు చేయటం, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ శిబిరాలను నిర్వహించటం తదతర పరిణామాల నేపథ్యంలో... వాటన్నింటికీ ధీటుగా 'తగ్గేదేలే...' అన్నట్టుగా బీఆర్ఎస్ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆ కోణంలో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని... నేతలతో రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ సభ తర్వాత బీఆర్ఎస్ కార్యాచరణ, కార్యకలాపాలను మరింత ముమ్మరం చేయాలని ఆయన భావిస్తున్నారు.
మరోవైపు ఖమ్మంలో నిర్వహించబోయే సభకు నలుగురు ముఖ్యమంత్రులు పినరయి విజయన్ (కేరళ), స్టాలిన్ (తమిళనాడు), కేజ్రీవాల్ (ఢిల్లీ), భగవంత్‌మాన్ (పంజాబ్) హాజరు కానున్నారు. వీరితోపాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ను, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామిని కూడా కేసీఆర్ ఆహ్వానించారు. ముఖ్యమంత్రులందరూ 18న హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాఫ్టర్ల ద్వారా ఖమ్మం బయల్దేరి వెళతారు. కేరళ సీఎం పినరయి విజయన్ షెడ్యూల్ రీత్యా సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించాల్సిన సభకు... మధ్యాహ్నం మూడు గంటలకే ప్రారంభించనున్నారు. బహిరంగ సభలో ఆయనే మొదటగా ప్రసంగిస్తారు. అనంతరం విజయన్ ఖమ్మం నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరి విజయవాడకు వెళతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో అదే రోజు సాయంత్రం తిరువనంతపురానికి చేరుకుంటారు. ఆయన వెంట సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా సభకు హాజరవుతారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాతోపాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా సభలో పాల్గొంటారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా నలుగురు సీఎంలు హైదరాబాద్‌లోని నూతన సచివాలయాన్ని సందర్శిస్తారనే ప్రచారం కొనసాగినా... అందులో వాస్తవం లేదని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. కొత్త సెక్రటేరియట్‌లోని సీఎం ఛాంబర్‌ను ఈనెల 18న ప్రారంభిస్తారనే ప్రకటనలు వెలువడినా... ఖమ్మం సభ నేపథ్యంలో అది వాయిదా పడింది.