Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పండుగ వాతావరణం సంతరించుకున్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. బీఆర్ఎస్ నూతన జాతీయ పార్టీ ఏర్పాటైన నేపథ్యంలో సంక్రాంతి రావడం వారి ఉత్సాహాన్ని మరింతగా రెట్టింపు చేసింది. ఆ రాష్ట్రవ్యాప్తంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, కృష్ణ, గుంటూరు విజయవాడ సహా యానాం, అవిడిరేవు, కొత్త పేట, కడియం, కాకినాడ, ముమ్మిడి వరం, ముక్కామల వంటి ఆంధ్రాలోని పలు ముఖ్య పట్టణాలలో, జాతీయ రహదారుల వెంట, బిఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు భారీ ఎత్తున వెలిశాయి. పార్టీ అభిమానులు, నేతలు ఫ్లెక్సీల ద్వారా బీఆర్ఎస్ పార్టీపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తెలంగాణ సీఎం కేసిఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఆంధ్రాలో కూడా రాష్ట్ర శాఖను ఏర్పాటు చేయడం, పార్టీ కార్యకలాపాలను ఉధృతం చేస్తుండటం, పలువురు జాతీయ నేతలను ఆహ్వానించి వారు ముఖ్య అతిథులుగా ఈ నెల 1న తమ సరిహద్దు ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తుండడం పట్ల ఆంధ్రా వ్యాప్తంగా ప్రజల్లో చర్చ ప్రారంభమైంది. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఆంధ్రాకు సంక్రాంతికి వచ్చిన తమ బంధువులు స్నేహితులు, కేసిఆర్ పార్టీ ఆంధ్రాకు విస్తరిస్తున్న రాజకీయ పరిణామాలపై తమ వారి అభిప్రాయాలను ఆలోచనలను సేకరిస్తూ ఆసక్తికర చర్చ కొనసాగుతుండడం పలువురిని ఆలోచింపజేస్తున్నది.