Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యారోగ్యశాఖ పోస్టులు మళ్లీ తాత్కాలికమే
- వ్యతిరేకిస్తున్న డాక్టర్ల సంఘాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ వ్యవస్థే రద్దయిపోతుందని నిరుద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది భావించారు. రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ కూడా అదే. అయితే రాష్ట్రం సిద్ధించి ఎనిమిదేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు కాకపోగా, ఆ ప్రాతిపదికన పని చేస్తున్న వారు శ్రమదోపిడీకి గురవుతూనే ఉన్నారు. ఇటీవల ఆయా శాఖల వారీగా ఉద్యోగాలను భారీ స్థాయిలో భర్తీ చేస్తారనే ప్రచారంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. పోస్టులన్నింటినీ రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తారని వారు భావించారు. అయితే వారు ఊహించుకున్న దానికి భిన్నంగా పలు పోస్టులకు తిరిగి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇస్తుండటంతో డాక్టర్ల సంఘాలతో పాటు వైద్యారోగ్యశాఖలోని వివిధ క్యాడర్లకు చెందిన ఉద్యోగ సంఘాలు ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే నిరంతరాయంగా ఉండే పనుల కోసం రెగ్యులర్ ప్రాతిపదికనే పోస్టులను భర్తీ చేయాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ, అనుబంధంగా పెద్దాస్పత్రి, నర్సింగ్ కాలేజీలు స్థాపించాలని నిర్ణయించింది. ఆ మేరకు చర్యలకు పూనుకున్నది. దీంతో వైద్యవిద్యను, నర్సింగ్ విద్యను అభ్యసించాలనుకునే వారితో పాటు ఇప్పటికే చదువు పూర్తయి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు రెగ్యులర్ ఉద్యోగాలపై ఆశలు పెంచుకున్నారు. అయితే పోస్టుల భర్తీ విషయంలో కొన్ని పోస్టులకు రెగ్యులర్ ప్రాతిపదికన నోటిఫికేషన్ ఇవ్వడం, మరి కొన్నింటికి మాత్రం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు మాత్రమే ఆర్థికశాఖ అనుమతిస్తుండటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రాష్ట్రంలోని 14 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 201 మంది ట్యూటర్లను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకునేందుకు ఆర్థికశాఖ అనుమతించింది. ఇప్పటికే నేషనల్ హెల్త్ మిషన్తో పాటు, వివిధ విభాగాల పరిధిలో కాంట్రాక్టు సిబ్బంది తమను రెగ్యులర్ చేయాలనీ, భవిష్యత్తులో నియామకాలన్నింటినీ రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారిని యథాతథంగా భర్తీ చేయకుండా వెయిటేజీ ఇస్తూ, రెగ్యులర్గా కొన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు. మరి కొన్నింటికి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నింపేందుకే ఆసక్తి చూపిస్తుండటం కూడా ఉద్యోగులు, నిరుద్యోగుల్లో అసంతృప్తికి కారణమవుతున్నది. ఆరోగ్యశాఖ అందిస్తున్న సేవలు శాశ్వతమైనవి. అయితే అలాంటి సేవలందించే సిబ్బందిని మాత్రం తాత్కాలికంగా నియమించడంలో ఎలాంటి ఔచిత్యం లేదనీ, ట్యూటర్లతో సహా అన్ని పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని వైద్య, నర్సింగ్ సంఘాలు కోరుతున్నాయి.