Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీయస్సీ-2008 బీ.ఇడీ సెలెక్టెడ్ మెరిట్ అభ్యర్థులను
- సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా నియమించాలి
- సీఎం కేసీఆర్కు జూలకంటి రంగారెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డీయస్సీ-2008 బీ.ఇడీ సెలెక్డెట్ మెరిట్ అభ్యర్థుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తుది తీర్పును అమలు చేస్తూ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా నియమించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల భర్తీ కోసం బీ.ఇడీ, డి.ఇడీ అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పిస్తూ 2008 డిసెంబర్ ఆరున నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తుచేశారు. అనంతరం జీవో 28 ద్వారా డీ.ఇడీ అభ్యర్థులకు నియామకాల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పించడంతో అప్పటికే ఎంపికైన మెరిట్ బి.ఇడీ అభ్యర్థులు నష్టపోయారని తెలిపారు. దీనిపై హైకోర్టు 2022 సెప్టెంబర్ 27న బి.ఇడీ సెలెక్టెడ్ మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలనీ, 2008లో నోటిఫికేషన్ అనంతరం ఇచ్చిన జీవో ద్వారా నిబంధనలు మార్చడం చెల్లవనీ, ఆ నోటిఫికేషన్లో పేర్కొన్న మొత్తం పోస్టులు మెరిట్ బి.ఇడీ అభ్యర్థులతో భర్తీ చేయాలని ఆదేశించిందని పేర్కొన్నారు. 2016 జనవరిలో వరంగల్ పర్యటన సందర్భంగా ఉద్యోగాలిస్తామనీ, నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేస్తామంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామి అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.