Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్
- సంక్రాంతి వేడుకల్లో భాగంగా క్రీడోత్సవాలు ప్రారంభం
నవతెలంగాణ-మంచాల
ప్రతి మండలంలోనూ క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడోత్సవాలను స్థానిక సీఐ వెంకటేశ్‌గౌడ్‌తో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అనేక పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ వేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ పోరాటాల్లో యువకులు భాగం కావాలని కోరారు. అనంతరం సీఐ వెంకటేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
క్రీడాలతో మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర అశోక్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు బి.శంకర్, పి.జగన్, డీవైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి ఎస్.రాజు, మండల అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, ఆర్.స్వామి తదితరులు పాల్గొన్నారు.