Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేయకండి
- 18న బీఆర్ఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి
- వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-ఇల్లందు
''బీజేపీలో చేరడమంటే వారి రాజకీయ భవిష్యత్తు ముగిసినట్టే.. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో బీజేపీకి చోటు లేదన్నారు. డిపాజిట్ కూడా దక్కదు.. బీజేపీలోకి వెళ్లితే ఆత్మహత్యా సదృశ్యమే.. తల్లిలాంటి పార్టీకి ఎవరూ ద్రోహం చేయొద్దు.. బీజేపీ హఠావో.. సింగరేణి బచావో'' అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని బొజ్జాయిగూడెం ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో శనివారం నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 18న ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ భారీ సభకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీపీఐ(ఎం), సీపీఐ జాతీయ నేతలు రానున్నారని తెలిపారు. సభకు 5లక్షల మందిని సమీకరించి కేసీఆర్ సత్తా ఢిల్లీ దాక చాటాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు, ఎల్ఐసీ, బొగ్గుగనులు తదితర ప్రభుత్వ రంగాలను ప్రయివేటుకు ధారాదత్తం చేస్తోందన్నారు. లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉన్నవి ఊడగొడుతోందన్నారు. అదానీ, అంబానీలకే మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నామన్నారు. మొత్తం 91వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని చెప్పారు. దేశంలో ప్రకటించిన 10 ఉత్తమ పంచాయతీలు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. దీన్ని బట్టి రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక బొగ్గుట్టను ఎంతో అభివృద్ధి చేశామన్నారు. సీతారామ ప్రజెక్టుతో నియోజకవర్గంలోని 5 మండలాలకు నీరందించేందుకు రూ.400 కోట్ల ప్యాకేజీని సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు మరిన్ని నిధులిచ్చి 100 పడకలకు పెంచుతామని చెప్పారు. ఎమ్మెల్యే హరిప్రియ అధ్యక్షతన జరిగిన సభలో ప్రభుత్వ చీఫ్ విప్ రేగా కాంతారావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ, రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు తదితరులు పాల్గొన్నారు.