Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సికింద్రాబాద్-విశాఖపట్నం (ట్రైన్ నెంబర్ 20834), విశాఖపట్నం-సికింద్రాబాద్ (ట్రైన్ నెంబర్ 20833) వందే భారత్ రైళ్ళను ప్రధాని నరేంద్రమోడీ ఆన్లైన్ ద్వారా ఆదివారం ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ రైలు టైమింగ్స్, టిక్కెట్ ధరలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ధరలను చూసిన ప్రయాణీకులు రైలులో ఎన్ని సౌకర్యాలు ఉన్నా, ఇంత ఖరీదా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. వందేభారత్ పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారని రైలు ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. ఈ రైలులో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే చైర్కార్లో అయితే ఒక టిక్కెట్ ధర అక్షరాల రూ.1,720. ఎగ్జిక్యూటివ్ క్లాస్ టిక్కెట్ ధర రూ.3,170. ఈ రూట్లో ఇప్పటి వరకు ఏసీ బోగీల్లో ప్రయాణం చేసినా ఇంత చార్జీలు లేవని ప్రయాణీకులు చెప్తున్నారు. ఈ రైలు ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజుల్లో నడుస్తుంది. ఈ రైలులో సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఒక్కరికి రూ.905 (ఛైర్ కార్), రూ.1775 (ఎగ్జిక్యూటివ్ క్లాస్), సికింద్రాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి రూ.1,365 (ఛైర్ కార్), రూ.2,485 (ఎగ్జిక్యూటివ్ క్లాస్) టికెట్ ధరలను నిర్ణయించారు. ఈ ఛార్జీలతో టిక్కెట్ అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యాన్ని శనివారం నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. 15న ఈ రైలును ప్రధాని ప్రారంభించినా, సాధారణ ప్రయాణీకులకు ఈనెల 16 నుంచి అందుబాటులోకి వస్తుంది. విశాఖ నుంచి బయలుదేరే ఈ రైలు ఉదయం 5.45 గంటలకు అక్కడ బయల్దేరి, మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరే రైలు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై, రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మార్గమధ్యంలో రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ రైల్వేస్టేషన్లలో ఆగుతుంది.