Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్య, ఉపాధ్యాయ అంశాలపై సుదీర్ఘమైన చర్చలు
- భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం
- ముగిసిన మహాసభ
- ఆహ్లాదకరమైన, ఆలోచింపజేసే కొటేషన్లతో సభా ప్రాంగణం అలంకరణ
- ప్రతినిధుల ప్రశంసలు పొందిన మహాసభ ఆహ్వాన సంఘం
నవతెలంగాణ రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఐదో మహాసభ శనివారం విజయవంతంగా ముగిసింది. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లోని బీఎమ్ఆర్ కన్వెన్షన్ సెంటర్లోని కామ్రేడ్ నాగటి నారాయణనగర్, కామ్రేడ్ ముంత ఆంజనేయులు ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమైన మహాసభ ఉత్సాహపూరితమైన వాతావరణంలో రెండ్రోజులపాటు నడిచింది. విద్యార్థి, ఉపాధ్యాయ సంక్షేమాలపై సుదీర్ఘమైన చర్చ జరిగాయి. మహాసభ ఎంత ఉత్సాహంతో ప్రారంభమైందో ఇంతే వరవడితో భవిష్యత్ కార్యాచరణపై ప్రతినిధుల చర్చ కొనసాగింది. మహాసభకు పెద్ద సంఖ్యలో హాజరైన ఉపాధ్యా యులు.. శుక్రవారం ఉదయం 9గంటలకు రాగన్నగూడెం నుంచి ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభా ప్రాంగణంలో యుటీఎఫ్ సీనియర్ నాయకులు పతాకాలను ఎగురవేశారు. ఈ మహాసభకు హాజరైన కేరళ ప్రభుత్వ విప్ కేకే శైలజా టీచర్ అమరులను స్మరిస్తూ అమరవీరుల స్థూపానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం మహాసభను ప్రారంభించారు. అదేవిధంగా మహాసభకు హాజరైన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు వ్యక్తులు ఉపాధ్యాయ, విద్యార్థి సంక్షేమంపై ప్రసంగించారు.
ప్రతినిధుల సభలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో రెండేండ్లలో చేసిన కార్యక్రమాలు, సాధించిన విజయాలు, లోపాలు, జిల్లా కమిటీల పని విధానం, ఇలా పలు అంశాలపై రాష్ట్ర కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. రాష్ట్ర కార్యదర్శి నివేదికపై శుక్ర, శనివారం ఉదయం వరకు చర్చలు జరిగాయి. ఆయా జిల్లాల ప్రతినిధులు పలు అంశాలపై ప్రశ్నించగా.. కార్యదర్శి సమాధానం ఇచ్చారు. అనంతరం విద్యార్థి, ఉపాధ్యాయ సంక్షేమం, ఉపాధ్యాయుల సమస్యలు, సర్కారు బడుల బలోపేతం, ఇలా 23 అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, తీర్మానాలు చేశారు. భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై చర్చించారు.
ఆలోచన రేకెత్తించే విధంగా సభా ప్రాంగణం
సమావేశ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన హోల్డింగ్స్‌పై కొటేషన్స్ ప్రతినిధులను ఆలోచింపజేశాయి. మహాసభ ఆహ్వాన సంఘం మంచి నినాదాలతో సమావేశ ప్రాంగణమంతా అలంకరించింది. కొటేషన్లు ప్రతినిధులను ఆకట్టుకున్నాయి.. 'బిడ్డల పాలకై బిచ్చమెత్తు దేశంలో రాళ్లకు పాలిచ్చు కథ నశించునదెన్నడో.. పేడకు బొట్టెట్టి దైవమని పూజించినవారు పేదను గుర్తించగ మారబోవునదెన్నెడో.. ఎప్పుడొచ్చును దేశానికి చైతన్యం అది తెచ్చుట కదా మన కర్తవ్యం' అనే కొటేషన్స్ ఆలోచింపచేశాయి.
ఇలా మరెన్నో కొటేషన్లు
'ఉపాధ్యాయులుగా మీ హక్కులకై పోరాడండి.. అదే సమయంలో సామాన్యుల పోరాటాలలో భుజం భుజం కలపండి' అని పుచ్చలపల్లి సుందరయ్య వాక్యం, 'మతం అనేది వ్యక్తిగత విషయం.. తనకిష్టం వచ్చిన మతాన్ని విశ్వసిం చేందుకు, విశ్వసించకుండా ఉండేందుకు పూర్తి స్వేచ్ఛ ఉంది' అన్న స్వామి వివేకా నంద కొటేషన్స్ ప్రతినిధులను ఆలోచింపచేశాయి. ఇక సభా ప్రాంగణం మొత్తం.. రెండేండ్లలో చేసిన కార్యక్రమాల దృశ్యమాలిక ప్రదర్శనలు ఆకట్టుకున్నా యి. మహాసభను విజయవంతం చేయడంలో రంగారెడ్డి జిల్లా కమిటీ కృషి చేసింది.
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె జంగయ్య,చావ రవి
- 21 మంది ఆఫీస్ బేరర్లు,151 మందితో రాష్ట్ర కమిట
నాగటి నారాయణ నగర్ (మన్నెగూడ) నుంచి బొల్లె జగదీశ్వర్
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్ ) రాష్ట్ర నూతన కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా కె జంగయ్య, ప్రధాన కార్యదర్శిగా చావ రవిని ప్రతినిధులు తిరిగి ఎన్నుకున్నారు. రెండురోజులపాటు నిర్వహించిన టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఐదో మహాసభలు రంగారెడ్డి జిల్లా మన్నెగూడలోని సార్థ కన్వెన్షన్ సెంటర్లో శనివారం ముగిశాయి. ఎన్నికల అధికారులుగా ఎంఏ కే దత్తు, మస్తాన్ రావు, రాజన్ బాబు వ్యవహారించారు. 21 మంది ఆఫీస్ బేరర్లు, 151 మందితో రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సిహెచ్ రాములు, సిహెచ్ దుర్గా భవాని, కోశాధికారిగా టీ లక్ష్మా రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు టీ సోమశేఖర్, ఏ వెంకటి, ఎం రాజ శేఖరరెడ్డి, వి శాంతి కుమారి, జి సమ్మారావు, డి సత్యానంద్, జి నాగమణి, ఈ గాలయ్య, బి రాజు, కె రంజిత్ కుమార్, ఎస్ రవి ప్రసాద్ గౌడ్, కె రవి కుమార్, ఎస్ మల్లారెడ్డి, జి శ్రీధర్, వై జ్ఞాన మంజరి, ఏ సింహాచలం ఎన్నికయ్యారు. ఆడిట్ కమిటీ కన్వీనర్ గా మహబూబ్ అలీ ఆడిట్ కమిటీ ని ఏడుగురు సభ్యులతో ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆడిట్ కమిటీ కన్వీనర్ గా మహబూబ్ అలీ, సభ్యులు గా అవ్వారి శ్రీనివాస్, జె యాకయ్య, సి లక్ష్మణ్ రావు, పి శ్రీనివాస రావు, రఘుపాల్, కె శంకర్‌ను ఎన్నుకున్నారు.