Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మక్క, ఉల్లిదీ అదే పరిస్థితి
- ఆందోళనలో నదీ పరివాహక రైతులు
- గిట్టుబాటు ధర కల్పించాలి : రైతు సంఘాల నాయకులు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
కృష్ణా పరివాహక ప్రాంతంలో రబీ కాలంలో ఎక్కువగా మినుములు, మక్క, ఉల్లిగడ్డ పంటలను సాగు చేస్తారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, తెగుళ్లు సోకడంతో పెట్టుబడి రెట్టింపు అయింది. చలి కాలంలో మంచు కురుస్తున్న సమయంలో తక్కువ నీటితోనే ఈ పంటలను సాగు చేసే అవకాశాలున్నాయి. సాగునీటి అవకాశం లేని రైతులు మంచు తేమ ఆధారంగా సాగు చేసే పంటలను అధికంగా వేస్తారు. అయితే, ఈసారి ఈ పంటల దిగుబడి అమాంతం పడిపోయింది. కానీ, మార్కెట్లో గిట్టుబాటు ధర మాత్రం లేదు. అటు పెట్టుబడి పెరిగి.. ఇటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పప్పు ధాన్యపు పంటలను అధికంగా సాగు చేస్తారు. ముఖ్యంగా నల్లభూముల్లో కుసుమ, దనియాలు, పప్పుశనగ పంటలను సాగు చేస్తారు. నీరు లేకున్నా రాత్రిపూట కురిసే మంచుకే పంటలు చేతికి వస్తాయి. వీటితో పాటు మినుములు, మక్క, ఉల్లిగడ్డ పంటలను సైతం కృష్ణ, తుంగభద్ర, బీమా నదుల పరివాహక ప్రాంతంలో అధికంగా సాగు చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో పెంట్లవెల్లి, పెద్దమరూరు, చిన్నంబావి. జెట్పోల్, చెల్లెపాడు, వీపనగండ్ల, అమ్మపల్లి, లక్ష్మింపల్లి, జెట్పోల్ తదితర ప్రాంతాల్లో మునుములు, మక్క, ఉల్లిగడ్డ పంటలను అధికంగా సాగు చేస్తారు. అధికారిక లెక్కల ప్రకారం.. కొల్లాపూర్‌లోనే 10 వేల ఎకరాలు, వనపర్తిలో ఐదు వేల ఎకరాల్లో సాగు చేశారు. ఎకరం పొలంలో మినుములు సాగు చేయడానికి రూ.30 వేల ఖర్చు అవుతోంది. బాగా పండినా 8 క్వింటాళ్లకు మించి దిగుబడి రాదు. క్వింటాలుకు రూ.6వేలకు మించి ధర ఉండటం లేదని పలువురు రైతులు తెలిపారు. దీంతో సాగు చేసిన పంటలకు పెట్టుబడి సైతం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తుపాన్‌తో నష్టం
పంట వేసే సమయంలో అధిక వర్షాలతోపాటు తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో విత్తనం మురిగిపోయింది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో మినుములు వేశారు. ఒకసారి మురిగిపోతే మరోసారి వేయడంతో పెట్టుబడి రెండింతలైయింది. ఏటా గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. పంట చేతికొచ్చాక స్పందించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం గిట్టుబాటు ధరతోపాటు జరిగిన నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
పెట్టుబడైనా రావడం లేదు
రైతు రాములమ్మ - చిన్నంబావి మండలం- నాగర్‌కర్నూల్ జిల్లా
నేను ఆరెకరాల్లో మినుములు సాగు చేశాను. రెండెకరాలు నా సొంత భూమి. మరో నాలుగెకరాలు లీజుకు తీసుకున్నాను. విత్తనం దశలో తుపాన్ రావడంతో మొలక మొత్తం చనిపోయింది. రెండు సార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది. ఎకరాకు రూ.30 వేల ఖర్చు అయ్యేది. రెండు సార్లు వేయడం వల్ల ఖర్చు రూ.40 వేలకు పెరిగింది.
రైతులను ఆదుకోవాలి
బాల్‌రెడ్డి- రైతు సంఘం జిల్లా అధ్యక్షులు- నాగర్‌కర్నూల్
రబీలో సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారు. ముఖ్యంగా తుపాన్ వల్ల పంటలు బాగా దెబ్బ తిన్నాయి. దిగుబడి సగానికి పడిపోయిం ది. పెట్టు బడి రెట్టింపు అయింది. అధికారులు వెంట నే స్పం దించి పంట నష్టంపై సర్వే చేయాలి. రైతుల కు నష్ట పరిహారం అందించేందుకు చర్యలు తీసుకో వాలి. లేనిచో రైతులందరినీ కూడగట్టి ఆందోళన చేస్తాం.