Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు బడుల్లో ప్రీప్రైమరీని ప్రారంభించాలి
- కంప్యూటర్ విద్యను అమలు చేయాలి
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఎస్, యూపీఎస్ టీచర్లకు ఓటు హక్కు కల్పించాలి
- టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలో 37 తీర్మానాలు ఆమోదం
నాగటి నారాయణ నగర్ (మన్నెగూడ) నుంచి బొల్లె జగదీశ్వర్
పాఠశాల విద్యలో సమస్యలను అధ్యయనం చేసేందుకు విద్యాకమిషన్‌ను నియమించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించాలని కోరింది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఉన్న బీఎంఆర్ సార్థ కన్వెన్షన్ సెంటర్(నాగటి నారాయణ నగర్)లో శుక్ర వారం ప్రారంభమైన టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఐదో మహాసభ శనివారం అత్యంత జయప్రదంగా ముగిసింది. విద్యారంగం, ఉపాధ్యాయుల సంక్షేమంతోపాటు పలు ఇతర సమస్యలపై 37 తీర్మానాలను మహాసభలో ఏకగ్రీవంగా ఆమోదించారు. జాతీయ విద్యావిధానం-2020ని రద్దు చేయాలని మహాసభ డిమాండ్ చేసింది. పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను వెంటనే నియమించాలని కోరింది. స్వీపర్, అటెండర్, వాచ్మెన్, క్లరికల్ పోస్టులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. మన ఊరు-మనబడి, మనబస్తీ- మనబడి కార్యక్రమానికి తగిన నిధులను విడుదల చేసి కాలపరిమితిలోగా పనులను పూర్తి చేయాలని సూచించింది. ఇంగ్లీష్ మీడియాన్ని బోధించేందుకు వీలుగా ఉపాధ్యాయులకు కావాల్సిన నైపుణ్యాలను పెంచాలనీ, అదనపు టీచర్లను నియమిం చాలని కోరింది. ఎఫ్ఎల్ఎన్ అమల్లో సమస్యల ను పరిష్కరించాలని పేర్కొంది. మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరింది. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనీ, అన్ని విధాలుగా వాటిని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేసింది. రెగ్యులర్ డీఈవో, డిప్యూటీఈవో, ఎంఈవో పోస్టులను మంజూరుచేసి వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. ఎంఆర్సీ స్కూల్ కాంప్లెక్స్ లను బలోపేతం చేయాలని పేర్కొంది. పాఠశాలల యాజమాన్య కమిటీలను బలో పేతం చేసి వాటి అభివృద్ధిలో సంపూర్ణ భాగ స్వాములయ్యే విధంగా విధానాలు రూపొందించి అమలు చేయాలని కోరింది. పాఠశాలల్లో అన్ని స్థాయిల్లోనూ కంప్యూటర్ విద్యను అందించాలని సూచించింది. విద్యార్థు లకు నాలుగు జతల బట్టలు, నోటుబుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు, చెప్పులు, బెల్టు, బ్యాడ్జీ, ఐడీ కార్డులను ప్రభుత్వమే ఉచితంగా అందిం చాలని తెలిపింది. బాలికలకు హెల్త్ కిట్లను అందించాలని పేర్కొంది. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, హాస్టళ్లు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మెస్‌చార్జీలను కనీసం 30 శాతం మేర పెంచి పౌష్టికాహారం అందించాలని కోరింది. ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. 317 జీవో కారణంగా ఏర్పడిన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరింది. ఈహెచ్ఎస్ పథకంలో నగదు రహిత వైద్యాన్ని సమగ్రంగా అమలు చేయాలని పేర్కొంది. జీపీఎఫ్ ఖాతాలను కొత్త జిల్లాలకు బదిలీ చేయాలని తెలిపింది. మెడికల్ రీయింబర్స్ మెంట్ గరిష్ట మొత్వాన్ని రూ.ఐదు లక్షలకు పెంచాలని సూచించింది. పాఠశాల విద్యాశాఖలో పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత, ఇతర ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని కోరింది. పారదర్శకత కోసం సిటిజన్ చార్టర్‌ను ప్రకటించి అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వారికి ప్రతినెలా మొదటి తేదీన్నే జీతాలు చెల్లించాలని కోరింది. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని తెలిపింది. 2004, సెప్టెంబర్ ఒకటి కంటే ముందే ఎంపికై ఆ తర్వాత నియామకమైన డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల కనుణంగా పాత పెన్షన్‌ను వర్తింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, కేజీబీవీ టీచర్లు, గురుకుల ఉపాధ్యాయులు, గిరిజన సంక్షేమ పాఠశాలలు, సింగరేణి పాఠశాలల్లోని సమస్య లను పరిష్కరించాలని కోరింది. క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ బోధకుల సమస్యలను పరిష్కరిం చాలని విజ్ఞప్తి చేసింది. విద్యావైద్య రంగాలను పూర్తిగా ప్రభుత్వరంగంలోనే నిర్వహించి అందరికీ సమానమైన, నాణ్యమైన చదువును, వైద్యాన్ని ఉచితంగా అందించాలని పేర్కొంది. ప్రభుత్వ రంగంలోని అన్ని శాఖల్లోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం ఉద్యోగులను రాష్ట్ర వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పేర్కొంది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ)ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే టీచర్లందరికీ ఓటు హక్కు కల్పించాలని కోరింది. పాఠశాలల్లో ఉపాధ్యాయులపై మతోన్మాద మూకదాడులను అరికట్టాలని డిమాండ్ చేసింది.