Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ..
- మంత్రి హరీశ్ నేతృత్వంలో సన్నాహక సమావేశాలు
- 13 నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ..
- 'వ్యయ'ప్రయాసలపై నేతల్లో టెన్షన్..
గులాబీ సమర శంఖారావం పూరించింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను ఖమ్మంలో ఈనెల 18న భారీగా నిర్వహించేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. ఆర్థికమంత్రి హరీశ్ రావు నేతృత్వంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. స్థానిక మంత్రి పువ్వాడ అజరు కుమార్ సైతం దిశా నిర్దేశం చేస్తున్నారు. దాదాపు 5 రోజులుగా ఏర్పాట్లలో తలమునకలయ్యారు.
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సభా విజయవంతమే తమకు పండుగని సంక్రాంతి వేడుకలను సైతం పక్కకు పెట్టి ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం గులాబీమయం అయింది. తోరణాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లతో అలంకరించారు. ఈ బహిరంగ సభకు ఖమ్మం చుట్టుపక్కల 13 నియోజకవర్గాల నుంచి భారీగా తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సభకు నలుగురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి ముఖ్య నేతలు హాజరవుతున్న దృష్ట్యా భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
'వ్యయ' ప్రయాసలపై టెన్షన్..
ఈ సభను బీఆర్ఎస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వ్యయ ప్రయాసలపై నేతల్లో టెన్షన్ నెలకొంది. ఖమ్మానికి 100 కిలోమీటర్ల లోపులోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆరు నియోజకవర్గాల నుంచి 50 వేలకు తగ్గకుండా జన సమీకరణ చేయాలని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు ఆదేశాలు ఇవ్వడంతో వ్యయ ప్రయాసలు కోర్చి జన సమీకరణ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేకి రూ.ఐదు నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. జనం అందరికీ రవాణా, ఆహార ఏర్పాట్లు, ఇతరత్రా ఖర్చులు అన్నీ సంబంధిత ఎమ్మెల్యే, ఇతర ముఖ్య నేతలే భరించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సన్నాహక సమావేశాల్లో హాట్ హాట్ కామెంట్స్... ఒకే వేదికపై కందాల, తుమ్మల
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారని ఊహాగానాల నేపథ్యంలో ఆయనకు ఈ సభకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. ఫ్లెక్సీల్లోనూ ఎక్కడా పొంగులేటి ఫోటోలు లేవు. ఇక ఆయన పార్టీ మారడం లాంఛనమేననే చర్చ సాగుతోంది. 'కమ్యూనిస్టు గడ్డపై మతతత్వ పార్టీలకు చోటు లేదని.. ఎవరైనా ఆ పార్టీలో చేరాలని భావిస్తే అది ఆత్మహత్యా సదృశ్యమేనని, వారి గొయ్యి వారు తీసుకున్నట్టేనని..' మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలు చేశారు. మరో మంత్రి పువ్వాడ అజరుకుమార్... 'ఖమ్మంలో పనికిమాలిన బ్యాచ్ తయారయిందని, పార్టీ ఐక్యంగా ఉంటే చూడలేకపోతుందని.. తాను కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని, అజరు సైన్యం.. అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇటువంటి వ్యాఖ్యలు చేస్తోందని, ఇంకా దంచాల్సిన వాళ్లను దంచాకనే తాను ఎటైనా పోతానని' వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. మరోవైపు ఉప్పు నిప్పుగా ఉంటున్న పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఒకే వేదికపై కనిపించడం చర్చనీయాంశమైంది. ఖమ్మం జిల్లా తెలంగాణ భవన్ లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారిద్దరూ ఒకే వేదికను పంచుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. కనీసం వారిద్దరూ ఒకరి వైపు మరొకరు కన్నెత్తైనా చూసుకోక పోవడం గమనార్హం.
బహిరంగ సభ షెడ్యూల్
18న బీఆర్ఎస్ బహిరంగ సభ మూడు గంట ల పాటే కొనసాగుతుంది. నలుగురు ముఖ్య మంత్రులు సీఎం కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు పినరరు విజయన్, అరవింద్ కేజ్రివాల్, భగవంత్ మాన్ సింగ్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, సీపీఐ (ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు మాత్రమే ప్రసంగిస్తారు. వారికి ప్రొటోకాల్ ప్రకారం కేటాయించిన మంత్రులు, ముఖ్య నేతలు స్వాగతం పలుకుతారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఢిల్లీ, పంజాబ్ సీఎంలకు మంత్రి మహమూద్‌అలీ, కేరళ సీఎంకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆహ్వానిస్తారు.