Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం
- సంతోషం...మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్)కు చెందిన సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండిస్టియల్ రివల్యూషన్ (సీఎఫ్‌ఐఆర్) సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కే తారకరామారావు నేతృత్వంలోని అధికారుల బృందం హాజరైన విషయం తెలిసిందే. ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు ఇక్కడ ఈ సదస్సు జరగనుంది. తొలిరోజు సదస్సులో సీఎఫ్‌ఐఆర్ మేనేజింగ్ డైరెక్టర్ జెరేమీ జర్గన్స్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సెన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కే తారక రామారావు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్జ్ బ్రెందే తదితరులు పాల్గొన్నారు. జీవ శాస్త్రాలు (లైఫ్ సైన్సెస్), ఆరోగ్య సంరక్షణ అంశాలపై సీఎఫ్‌ఐఆర్ కేంద్రం అధ్యయనం చేస్తుంది. భారతదేశంలో ఈ విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అనీ, అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయని సీఎఫ్ఆర్ఐ ప్రతినిధులు తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో రాష్ట్రానికి ఉన్న అనుకూలతలకు ఇది నిదర్శనమని చెప్పారు. హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అగ్రగామిగా నిలిచేందుకు భారతదేశానికి మంచి అవకాశం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే అన్నారు. ప్రభుత్వం,పరిశ్రమల మధ్య సమన్వయంతోపాటు ఉద్యోగ, ఉపాధి కల్పన విషయాల్లో హైదరాబాదు కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరు గుతాయన్నారు. వ్యాక్సిన్లు, ఔషధాల తయారీలో భారతదేశం, హైదరాబాద్‌లకు మంచి ట్రాక్ రికార్డు ఉందనీ, నాల్గవ పారిశ్రామిక విప్లవ సాంకేతికతను ఉపయోగించుకొని ఆరోగ్య సంరక్షణలో గ్లోబల్ పవర్ హౌస్ గా ఇండియా మారుతుందన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెల్త్ కేర్ విభాగాధిపతి డాక్టర్ శ్యామ్ బిషెన్ తదితరులు పాల్గొన్నారు.
స్విట్జర్లాండ్‌లో మంత్రి కేటీఆర్ బృందానికి ఘనస్వాగతం
అంతకుముందు మంత్రి కే తారకరామారావు బృందం జ్యూరిక్ సిటీ చేరుకోగానే స్విట్జర్ల్యాండ్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు శ్రీధర్ గండె, ఇతర తెలుగు సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మంత్రి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న పలు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ వివరించారు.