Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముస్తాబైన బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్
- 18 నుంచి 22 వరకు...
- తొలిరోజు శ్రామిక మహిళా సదస్సు
- 1500 మంది ప్రతినిధులు హాజరు
- 22న నేషనల్ కాలేజీ గ్రౌండ్లో బహిరంగసభ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఐటీయూ అఖిల భారత 17వ మహాసభ బుధవారం కర్నాటక రాజధాని బెంగుళూరు నగరంలో ప్రారంభం కానున్నది. మహాసభ ప్యాలెస్ గ్రౌండ్లో ఐదురోజుల పాటు అనగా 18 నుంచి 22వ తేదీ వరకు జరుగనున్నది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి హాజరయ్యే 1,500 మంది ప్రతినిధులు సీఐటీయూ భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనలో పాలుపంచుకోబోతున్నారు. తెలంగాణ నుంచి 61 మంది ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. అందులో 15 మంది మహిళలున్నారు. మహాసభ చివరిరోజైన 22వ తేదీన బెంగుళూరులో నేషనల్ కాలేజీ గ్రౌండ్లో వేలాదిమందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ మహాసభలో ముఖ్య అతిథులు డబ్ల్యూఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి పాంబిస్ క్రిస్టిసిస్, చేగువేరా కూతురు అలైదా గువేరా, మనువరాలు ప్రొఫెసర్ ఎస్టీఫినా గువేరాతో సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్, అధ్యక్షులు కె.హేమలత, జాతీయ నాయకులు పాల్గొనబోతున్నారు. మహాసభల విజయవంతం కోసం రిసెప్షన్ కమిటీ ఆధ్వర్యంలో వేసిన 27 సబ్ కమిటీలు తమ శక్తిమేర కృషిచేస్తున్నాయి. సీఐటీయూ అఖిల భారత మహాసభల ఆవశ్యకతను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడానికి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు 500 కమిటీలు నిర్విరామంగా పనిచేశాయి. ఎనిమిది రోజులుగా బెంగుళూరు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కార్మికులను, ప్రజలను చైతన్యపరిచేలా సాంస్కృతిక కార్యక్రమాలను రిసెప్షన్ కమిటీ నిర్వహిస్తున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల ఎనిమిదిన్నర ఏండ్ల కాలంలో ప్రజలు, కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సామాజిక సమస్యల ఇతివృత్తంగా షార్ట్ ఫిలిం కాంపిటేషన్ నిర్వహించగా మంచి స్పందన లభించింది. కార్మికుల కుటుంబాల వద్దకెళ్లి, స్ట్రీట్ క్యాంపెయిన్స్ ద్వారా విరాళాలు సేకరించాయి.
మహాసభ నిర్వహణ కోసం సేకరించిన నిధుల్లో 90 శాతం ఈ రూపంలోనే రావడం గమనార్హం. అదే సమయంలో మహాసభల జయప్రదం కోసం కర్నాటకలో నాలుగు జీపుజాతాలు జరిగాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్ కార్మికుల పోరాట చైతన్య స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ కేజీఎఫ్ నుంచి ప్రారంభమైన జీవుజాతా మహాసభ ప్రారంభం రోజు ప్యాలెస్గ్రౌండ్కు చేరుకోనున్నది. బుధవారం ప్యాలెస్ గ్రౌండ్లో మహాసభ ప్రారంభ సూచికగా సీఐటీయూ జెండా ఎగురవేసే సమయంలో 500 మందితో కూడిన రెడ్షెట్ వాలంటీర్ల దళం ప్రత్యేకంగా డ్రమ్స్ వాయిస్తూ కవాతు చేయనున్నది. మహాసభకు హాజరయ్యే ప్రతినిధులు ప్రాంతీయ భాషల్లో ప్రసంగాలు చేసినా భాషాపరమైన సమస్యలు తలెత్తకుండా ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, కన్నడం, మళయాలం, తదితర భాషల్లోకి వెంటనే తర్జుమా చేసే ప్రత్యేక సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.