Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భార్య, కూతురు, తల్లిని చంపి తాను ఆత్మహత్య?
నవతెలంగాణ-ఓయూ
హైదరాబాద్ తార్నాకలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందారు. భర్త తన భార్య, తల్లి, కూతురుకు విషమిచ్చి చంపి, తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఓయూ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకు చెందిన ప్రతాప్(34) సింధూర(32)లకు 8 ఏండ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆధ్య(4) అనే కూతురు ఉంది. ప్రతాప్ చెన్నైలో ఉంటూ బీఎండబ్ల్యూ కార్ షోరూమ్‌లో డిజైనర్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న సింధూర తన కూతురు ఆద్య, ప్రతాప్ తల్లి రాజాతి(69) తార్నాకలోని రూపాలి అపార్ట్మెంట్ మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. ప్రతాప్ వీకెండ్స్‌లో హైదరాబాద్‌కు వచ్చి వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం బయటకు వెళ్లిన ప్రతాప్ దంపతులు ఆదివారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చినట్టు తెలిసింది. అయితే సోమవారం మధ్యాహ్నం వరకు సింధూర బ్యాంకుకు వెళ్లకపోవడంతో సిబ్బంది బ్యాంక్ నుంచి ఆమెకు కాల్ చేసినా స్పందించలేదు. దాంతో బ్యాంక్ నుంచి ఓ ఉద్యోగి సింధూర ఇంటికి వచ్చి తలుపు తట్టినా తెరవలేదు. అనుమానం వచ్చిన ఆ వ్యక్తి సమీపంలోని అపార్ట్మెంట్లో ఉండే వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. సింధూర కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా, ప్రతాప్ ముందు హాలులో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. ఒక బెడ్ రూమ్‌లో సింధూర, ఆమె కూతురు ఆద్య, మరో బెడ్ రూమ్‌లో ప్రతాప్ తల్లి పడిపోయి ఉన్నారు. ప్రతాప్, ఆద్య, ప్రతాప్ తల్లి రాజాతి అప్పటికే మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న సింధూరను గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఓయూ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ తెలిపారు. సింధూర ఏడేండ్లుగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగం చేస్తున్నది. నాలుగేండ్లు చెన్నైలో పనిచేసిన ఆమె అనంతరం హైదరాబాద్‌కు వచ్చి కొంత కాలం తార్నాకలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో విధులు నిర్వహించి ఇటీవల హిమాయత్ నగర్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యింది. వారి మృతికి కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.