Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావుకు మహేష్‌కుమార్ హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ పని అయిపోయిందంటూ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ చెప్పారు. మా పని అయిపోలేదనీ, మీ పనిపట్టే పనిలోఉన్నామని హెచ్చరించారు. ఎన్నో అటుపోట్లు చూసిన కాంగ్రెస్ సముద్రం లాంటిదన్నారు. పదవులే పరమావధిగా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పని చేస్తున్నారని విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు అధికారం మీద యావ లేదని పునరుద్ఘాటించారు. సోనియా గాంధీ దయ వల్లే మీకు పదవులు వచ్చాయని చెప్పారు. ఈనెల 20, 21,22 తేదీల్లో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు. హాత్ సే హాత్ అభియాన్ యాత్రపై చర్చించి, కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లలో తప్పుల తడకగా ఉందని ఉపాధ్యాయ సంఘం నాయకులు హర్షవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఉపాధ్యాయ ఎన్నికల్లో కూడా మరో సారి వంచించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయనీ, ప్రతి నెల ఒకటో తేదీన రావాల్సిన జీతాలు, సమయానికి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం పుట్టిన రోజు సచివాలయం ప్రారంభమా? : కోదండరెడ్డి
సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకుని నూతన సచివాలయం ప్రారంభిస్తారా? అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి ప్రశ్నించారు. ఫిబ్రవరి 17న సీఎం పుట్టినరోజు కాబట్టి ప్రకటించామని మంత్రి చెప్పడం హాస్యాస్పందమన్నారు. జన్మదినం పెద్దగా జరుపుకోండి కానీ, సచివాలయం ప్రారంభం ఎందుకు? అని ప్రశ్నించారు. అధికారిక భవనం నిర్మాణ ప్రారంభోత్సవానికి విధివిధానాలుంటాయని గుర్తు చేశారు.