Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు యువకులు నీటిలో పడి మృతి
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి, దారూర్
వికారాబాద్ జిల్లా కోటిపల్లి ప్రాజెక్టులో నలుగురు యువకులు గల్లంతై మృతి చెందారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సంక్రాంతి పండుగ సందర్భంగా కోటిపల్లి ప్రాజెక్టులో సరదాగా విహారయాత్రకు వెళ్లారు. అక్కడ గుంత ప్రాంతం, బురద ఎక్కువగా ఉండడంతో గుర్తించలేదు. దీంతో నలుగురు గల్లంతు అయ్యారు. ఆ నలుగురిలో ఇద్దరికీ ఈత వచ్చినప్పటికీ, బురదలో ఇరుక్కు పోవడం కారణంగా ఒకరిని కాపాడబోయి మరొకరు అలా నలుగురు గల్లంతైనట్టు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న దారూర్ పోలీసులు స్థానికుల సహాయంతో నలుగురిని వెలికితీసి, వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో రాజేష్ (24), జగదీష్ (24), వెంకటేష్ (25), లోకేష్ (28) మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. అనంతరం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ ప్రమాదానికి గల కారణాలను ఆరా తీయడం జరిగింది.