Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రివిధ దళాల్లో మహిళా అగ్నివీరుల కోసం ఎదురుచూపులు. ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : సైన్యంలో అగ్నివీరులు కీలక పాత్ర పోషించనున్నారని ప్రధాని మోడీ అన్నారు. సోమవారం ప్రధాని డిఫెన్స్ ఫోర్స్‌లో చేరిన వివిధ రెజిమెంట్ సెంటర్లలోని అగ్నివీరుల తొలి బ్యాచ్‌తో ముఖాముఖిగా సంభాషించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. గోవా, హైదరాబాద్, మద్రాస్, పుణె, మధ్యప్రదేశ్‌లోని సాగర్, హిమాచల్ ప్రదేశ్‌లోని సబాతులో శిక్షణ పొందుతున్న అగ్నివీరులతో ప్రధాని మాట్లాడారు. 'అగ్నిపథ్' పథకానికి మార్గనిర్దేశకులకు అభినందనలు తెలిపారు. ఈ పరివర్తన విధానం సాయుధ బలగాలను పటిష్ఠం చేయడంలో కీలకంగా మారుతుందనీ, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంచుతుందని పేర్కొన్నారు.
యువ అగ్నివీరులు సాయుధ దళాలను మరింత యువోత్సాహం, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన శక్తిగా మారుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 'నవ భారతం నూతన శక్తితో నిండి ఉన్నది. మన బలగాలను ఆధునికీకరించడంతోపాటు వాటిని ఆత్మనిర్భరంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 21వ శతాబ్దంలో యుద్ధాల తీరు మారుతుంది. సాంకేతికంగా ముందంజలో ఉండే సైనికులదే సాయుధ దళాల్లో ముఖ్య భూమిక. ప్రస్తుత తరానికి ఈ సామర్థ్యం ఉంది. కాబట్టి.. సైన్యంలో అగ్నివీరులు కీలక పాత్ర పోషిస్తారు' అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అగ్నివీరుల స్ఫూర్తి సాయుధ బలగాల ధైర్యసాహసాలను ప్రతిబింబిస్తోందన్నారు. అగ్నివీరులుగా పొందే అనుభవం జీవితానికి గర్వకారణంగా ఉంటుందని తెలిపారు. అగ్నిపథ్ పథకం మహిళలకు మరింత సాధికారత కల్పిస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. త్రివిధ దళాల్లో మహిళా అగ్నివీరులను చూసేందుకు తాను ఎదురుచూస్తున్నానన్నారు. 'భిన్న ప్రదేశాల్లో విధుల వల్ల అక్కడి సంస్కృతితో మమేకం కావాలి. సమష్టిగా పని చేయడంతో పాటు ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలను మెరుగు పర్చుకోవాలి. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపాలి' అని అగ్నివీరులకు సూచించారు. 21వ శతాబ్దంలో దేశానికి నాయకత్వం దేశ యువత, అగ్నివీరుల అందించనున్నారని ప్రధాని మోడీ కొనియాడారు. పర్సనల్ బిలో ఆఫీసర్ ర్యాంకు (పీబీఓఆర్) కింద సుమారు 25,000 మంది సిబ్బంది తొలి బ్యాచ్‌లో అగ్నివీరులుగా శిక్షణ పొందుతున్నారు. ఇండియన్ ఆర్మీలో 19,000 మందిని, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చెరో 3,000 మందిని ఎంపిక చేశారు. వీరికి 24 నుంచి 31 వారాల పాటు శిక్షణ ఉంటుంది. ఆరు నెలల శిక్షాకాలం పూర్తి కాగానే, మరో 3.5 నెలల పాటు వారు సర్వీసులో కొనసాగుతారు. మొత్తం నాలుగేండ్ల పాటు వీరు సర్వీసులో ఉంటారు. వీరిలోనూ ప్రతిభ ఆధారంగా 25 శాతం మందిని తిరిగి రిక్రూట్ చేసుకుని మరో 15 ఏండ్లపాటు సర్వీసు కల్పిస్తారు. తక్కిన 75 శాతం మందికి రిటైర్మెంట్ ప్యాకేజీ 'సేవా నిధి' ఇస్తారు.