Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీయుఎంహెచ్ఇయూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిమాండ్ బ్యాడ్జీలతో ఈ నెల 18 నుంచి 21 వరకు కంటి వెలుగు డ్యూటీలకు హాజరు కావాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్ఇయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ ఫసియోద్దీన్, కె.యాదనాయక్ కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలు,ఈసీ ఎఎన్ఎంలు, ఆర్బన్ హెల్త్ సెంటర్ల ఏఎన్ఎంలు, వైద్య విధాన పరిషత్ ఏఎన్ఎంలు, హెచ్ఆర్డి ఏఎన్ఎంలు ఇతర అన్ని రకాల ఏఎన్ఎంలను యధావిధిగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. వైద్యారోగ్య రంగానికి బలమైన ఆయువు పట్టుగా ఉండి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఏ.ఎన్.ఎంలు రెండు దశాబ్దాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న నేటికీ రెగ్యులర్ కాకపోవడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎన్ఎంలు ఏకకాలంలో 36 రకాల రికార్డులు ఆన్ లైన్లో,ఆఫ్లైన్లో నమోదు చేస్తున్నారనీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని తెలిపారు. 23 సంవత్సరాలుగా పని చేస్తున్న ఏఎన్ఎంలకు 8, 9, 10 పీఆర్సీల ప్రకారం బేసిక్ పే ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణలో తొలి పీఆర్సీ బేసిక్ పే ఇవ్వకుండా 30 శాతం వేతనాలు మాత్రమే పెంచారనీ, దీంతో ఏఎన్ఎంలు ప్రతి నెలా రూ.ఐదు వేలు నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే బేసిక్ పే ప్రకారం వేతనాలు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండో ఏఎన్ఎంలు, ఈసీ ఎఎన్ఎంలు, అర్బన్ హెల్త్ సెంటర్ల ఏఎన్ఎంలు గత 23 సంవత్సరాలుగా పని చేస్తున్న కనీస వేతనాలు ఇవ్వకుండా, రెగ్యులర్ చేయకుండ ప్రభుత్వం మోసం చేస్తున్నదని విమర్శించారు.
ప్రభుత్వం వెంటనే వీరందరిని ఎలాంటి షరతులు లేకుండ యథావిధిగా రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న సెకండ్ ఎఎన్ఎంలు, ఈసీ.ఎఎన్ఎంలు, అర్బన్ హెల్త్ సెంటర్ల ఎఎన్ఎంలు, ఇతర అన్ని రకాల ఏఎన్ఎంలు డిమాండ్ బ్యాడ్జీలు ధరించి డ్యూటీలకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ స్పందనను బట్టి ఈ నెల 22న (ఆదివారం) భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వారు తెలిపారు.