Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ సూచన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా వైద్యరంగంలో వసతుల మెరుగుదలకు మరిన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్యరంగంలో వసతులు మెరుగవడం లేదని తాను చెప్పడం లేదనీ, అయితే వసతులు ఇంకా మెరుగుపడాల్సిన అవసరముందని అభిప్రాయ పడ్డారు. మలక్‌పేట ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మరణించడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక గైనకాలజిస్ట్‌గా తనకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయనీ, ఆసుపత్రికి వెళ్లాలని అనుకున్నప్పటికీ పండుగ కారణంగా ఆగిపోయినట్టు తెలిపారు. గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలోనూ నలుగురు మరణించారని గుర్తుచేశారు.
పరిశీలనలో ప్రభుత్వ బిల్లులు
ప్రభుత్వ బిల్లులు పెండింగ్‌లో లేవని తెలిపారు. తన పరిశీలనలో ఉన్నాయని స్పష్టం చేశారు. వర్సిటీ నియామకాల బిల్లులో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటి నియామకాల బిల్లు.. వివాదాలతో ఆలస్యం కారాదన్నదే తన ఉద్దేశమని తెలిపారు. ఈ తరహా విధానాలను గతంలో న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేశాయనీ, యూజీసీ కొన్ని అంశాలను ప్రస్తావించిందంటూ, యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ కావాలని తెలిపారు.
వరంగల్, ఖమ్మం ప్రజలకు చేరువగా సేవలు
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించిన సందర్భంగా ఆమె తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వేను ఆధునీకరిస్తున్నారని, స్టేట్ ఆఫ్ ఆర్ట్‌గా రైల్వేల అభివృద్ధి జరుగుతున్నదని కొనియాడారు. ప్రజలంతా టీవీలు చూస్తున్న సమయంలో నరేంద్రమోడీ రేడియోకి పునర్వైభవం తెచ్చారని తెలిపారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతో వరంగల్, ఖమ్మం ప్రజలకు సేవలు మరింత చేరువవుతాయని తమిళిసై అభిప్రాయపడ్డారు.