Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11వేల మందికి ప్రమోషన్లు దక్కే అవకాశం
- యుఎస్పీసీతో మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి సమావేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై రెండ్రోజుల్లో షెడ్యూల్ విడుదల కానున్నది. అయితే, బదిలీ అయిన, పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను లాస్ట్వర్కింగ్ డే రిలీవ్ చేస్తారు. సోమవారం హైదరాబాద్‌లో ఉపాధ్యాయ సంఘాలతో జేఏసీల వారీగా విడివిడి సమావేశాలను ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకేసారి బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు మంత్రులు అంగీకారం తెలిపారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న హైస్కూలు ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్ అన్ని కలిపి 11,000 ప్రమోషన్స్ వస్తాయి. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 960 పోస్టులకు పాత పద్దతిలో పదోన్నతులు ఇస్తారు. అప్‌గ్రేడ్ పోస్టులు 10, 479 పై కోర్టు కేసు పరిష్కారం అయిన వెంటనే కోర్టు ఆదేశాల ప్రకారం వాటికి ప్రమోషన్స్ ఇస్తారు.
జీఓ158 ప్రకారం ఎంఈఓ, డైట్ లెక్చరర్ ప్రమోషన్లను కూడా ఇవ్వాలని కోరగా, ప్రాతినిధ్యాన్ని పరిశీలించి న్యాయ సలహా తీసుకుని షెడ్యూల్లో చేర్చాలని విద్యాశాఖ అధికారులను మంత్రులు ఆదేశించారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, కేజీబీవీ బదిలీలు కూడా చేస్తామనీ, పదిరోజుల్లో షెడ్యూల్ ఇస్తామని స్పష్టం చేశారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా జరుపుతామని సంఘాలు సహకరించాలని కోరారు. జీఓ 317 బాధితుల గురించి ప్రస్తావించగా బదిలీలకు ముందుగానే సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. పండుగ రోజు శుభవార్త చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశామని మంత్రులు చెప్పారు. ఈ సమావేశంలో యుఎస్పీసీ తరఫున కె.జంగయ్య, చావ రవి, వై.అశోక్ కుమార్, ఎం.రవీందర్, ఎన్.యాదగిరి, ఎస్. హరికిషన్, బి.కొండయ్య, రామలింగం, టి.లక్ష్మారెడ్డి, పి.మాణిక్ రెడ్డి, నాగరాజు గౌడ్ పాల్గొన్నారు. ఎస్టీయూటీఎస్తో జరిగిన సమావేశంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.సదానందరగౌడ్, యం.పర్వత్‌రెడ్డి పాల్గొన్నారు. వేర్వేరు సంఘాలతో జరిగిన సమావేశాల్లో తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మునగాల మణిపాల్‌రెడ్డి, డాక్టర్ ఏడుకొండ నరసింహస్వామి, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూలరవీందర్, టీటీజేఏసీ ప్రతినిధులు రాజభాను, గంగారెడ్డి, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.మహిపాల్‌రెడ్డి, ఎ.వెంకటేశం, వనం వెంకటేశ్వర్లు, ఆర్‌యూపీపీటీఎస్ ఎస్సీఎస్టీటీఎఫ్- టి ఫెడరేషన్ జె.రాజన్న, ఎం.చరణ్‌దాస్, తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
అన్ని సంఘాలను ఆహ్వానించకపోవడం శోచనీయం : డీటీఎఫ్
ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై చర్చించేందుకు అన్ని ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించకపోవడం సరిగాదని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని మొదట గుర్తించిన సంఘాన్ని పిలువకపోవడం అన్యాయమని తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలనీ, అధికారిక సమావేశాలు జరిపేటప్పుడు పద్ధతి ప్రకారం ఆహ్వానించాలని కోరారు. అప్‌గ్రేడ్ భాషా పండితులు, పీఎస్‌హెచ్‌ఎం పోస్టులు మంజూరు చేయకుండా పదోన్నతులు ఇవ్వడం సరిగాదనీ, దాని వల్ల ఉపయోగం లేదని టీఎస్పీటీఏ పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం(టీఎస్పీటీఏ) రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ షౌకత్ అలీ ఒక ప్రకటన విడుదల చేశారు.