Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఠారెత్తిస్తున్న కరెంటు బిల్లులు
- కిరాయిదార్లు కాదు...యజమానులే కట్టాలి : టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎమ్‌డీ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) అడిషనల్ కంజెంప్షన్ డిపాజిట్ (ఏసీడీ) పేరుతో వినియోగదారుల్ని బాదేస్తున్నాయి. ఈ మేరకు జనవరి నెల బిల్లుల్లో ఏసీడీ పేరుతో అదనపు మొత్తాన్ని వడ్డించాయి. ఫిబ్రవరి నెలలో ఈ బిల్లుల్ని చెల్లించాలనీ పేర్కొంటున్నాయి. వినియోగదారులు కొత్త కరెంటు కనెక్షన్ తీసుకొనేటప్పుడు డిపాజిట్ చెల్లిస్తారు. అయితే ఆ ఏడాదిలో ఆ సర్వీసు నెంబర్‌తో జరిగిన విద్యుత్ వినియోగ సరాసరిని లెక్కించి...'మీరు కట్టిన డిపాజిట్ సొమ్ము చాల్లేదు...అదనంగా ఇంకా ఇంత మొత్తం కట్టండి' అని చెప్పడమే ఏసీడీ ఎమౌంట్. దీన్ని కిరాయిదారులు చెల్లించాలా...ఇండ్ల యజమానులు చెల్లించాలా అనే చర్చ చాలా కాలం నుంచి జరుగుతున్నది. ఈ సొమ్మును ఇండ్ల యజమానులే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) సీఎమ్‌డీ అన్నమనేని గోపాల్‌రావు స్పష్టం చేశారు. ఏసీడీ అంటే డిపాజిట్ సొమ్మును వసూలు చేయడమేననీ, యజమాని కరెంటు కనెక్షన్‌ను రద్దు చేసుకుంటే, ఆ సొమ్మును తిరిగి ఇచ్చేస్తామనీ, అందువల్లే ఇండ్ల యాజమానులు కట్టడమే న్యాయమని ఆయన తెలిపారు. ఈ తరహా వసూళ్లకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) రెగ్యులేషన్ నెంబర్ 6-2004 ప్రకారమే వసూళ్లు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. వినియోగదారులు కొత్త సర్వీసు తీసుకొనేటప్పుడు ఒక కిలోవాట్ లోడ్‌కు రూ.200 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ (ఎస్డీ)గా డిస్కంలు వసూలు చేస్తాయి. గత ఏడాదిలో వాడుకున్న యూనిట్ల సరాసరిని నెలకు లెక్కించి, రెండు నెలల డిపాజిట్‌ను ఏసీడీ పేరుతో జనవరి నెల బిల్లుల్లో వడ్డించారు. దీనితో కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని వినియోగదారులు మొత్తుకుంటున్నారు. వినియోగదారులకు ఇంకేవైనా సందేహాలు ఉంటే ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసు (ఈఆర్వో) కౌంటర్లో నివృత్తి చేసుకోవచ్చని డిస్కంల ఉన్నతాధికారులు చెప్తున్నారు.