Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం గులాబీమయం
- నూతన కలెక్టరేట్ వద్ద సిద్ధమైన సభా ప్రాంగణం
- నలుగురు సీఎంలు రానుండటంతో భారీ భద్రత
- అక్కడే కంటివెలుగుకు శ్రీకారం
- 5200 మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం
- ఉదయం 6 గంటల నుంచే ట్రాఫిక్ మళ్లింపు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం గులాబీమయమైంది. ఎటుచూసినా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, తోరణాలు, బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. నగరంలో ప్రతి పది మీటర్లకు ఓ ఫ్లెక్సీ.. భారీ కటౌట్లు ఏర్పాటుచేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా ఖమ్మంలో బుధవారం భారీ బహిరంగసభ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సభను ఐదు లక్షల మందితో నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సభకు తెలంగాణ, కేరళ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, పినరయ్ విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్ సింగ్‌తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్‌యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు హాజరుకానున్నారు. సభా ప్రాంగణంలో సంబంధిత సీఎంలు, ముఖ్యనాయకుల కటౌట్లతో అలంకరించారు. స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. అదేవిధంగా కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
సిద్ధమైన సభాప్రాంగణం..
నూతన కలెక్టరేట్ ఎదుట ఇప్పటికే సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ప్రాంగణాన్ని స్థల అనుకూలతను బట్టి సెక్టార్లుగా విభజించారు. 5వేలు మొదలు 50వేల వరకు ఒక్కోసెక్టార్ సామర్థ్యం ఉండేలా బారికేడ్లు ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రుల పర్యటన షెడ్యూల్‌ను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. రెండు హెలికాప్టర్లలో సీఎంలు సభాస్థలికి చేరుకుంటారని నేతలు తెలిపారు. ఇటు సీఎంలు, అటు జాతీయస్థాయి నేతలు రానున్న దృష్ట్యా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 5,200 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. మంగళవారం నుంచే ప్రధాన కూడళ్లు, ముఖ్య రహదారుల వెంట పోలీసులు మోహరించారు. సభా వేదికను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అనుమతి ఉన్న నాయకులు మినహా ఎవరినీ సభా వేదిక మీదకు ఎక్కకుండా భద్రతా చర్యలు చేపట్టారు. సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావుతో పాటు స్థానిక మంత్రి పువ్వాడ అజరుకుమార్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, మంత్రి మల్లారెడ్డి, లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, తాతా మధు, కౌశిక్‌రెడ్డి తదితరులు తుది ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. మరోవైపు సమీకృత కార్యాలయాల భవన సముదాయాన్ని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్‌సురభి, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, మధుసూదన్ తదితరులు మంత్రులతో కలిసి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
5,200 మందితో బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు..
మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ విష్ణు ఎస్ వారియర్ ప్రకటించారు. అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, ఐజీలు షానవాజ్‌ఖాసీం, చంద్రశేఖర్‌రెడ్డి, వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్, డీఐజీలు రమేష్‌నాయుడు, చౌహన్, ఖమ్మం సీపీ, మహబూబాబాద్, కొత్తగూడెం ఎస్పీలు, పది మంది అడిషనల్ ఎస్పీలు, ఏసీపీలు 39, సీపీఐలు, ఆర్ఐలు 139, ఎస్ఐలు 409 మంది ఇలా మొత్తం 5,200 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. నగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. సూర్యాపేట నుంచి ఖమ్మం వచ్చే వాహనాలను కోదాడ మీదుగా విజయవాడ హైవేకు మళ్లిస్తున్నారు. వరంగల్ నుంచి వచ్చే వాహనాలను వరంగల్ ఎక్స్‌రోడ్ మీదుగా కోదాడ మార్గంలో తరలిస్తున్నారు. అలాగే వాహనాల పార్కింగ్ కోసం క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చారు. సుమారు 400 ఎకరాలను పార్కింగ్ కోసం కేటాయించారు. ఏరియాల వారీగా నంబర్లు ఇచ్చారు. మీడియా పాస్‌ల బాధ్యతను మీడియా కన్వినింగ్ కమిటీకి అప్పగించడంతో పాస్‌ల కోసం తంటాలు పడాల్సి వచ్చింది. అయినా పాస్‌లు సక్రమంగా అందకపోవడంతో పలువురు స్థానిక మీడియా ప్రతినిధులు సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేశారు.