Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులకు మరోసారి వినతిపత్రాల సమర్పణ
- మల్లికార్జున్‌పై పెట్టిన బూటకపు కేసును ఉపసంహరించాలి
- దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి
- 23న భావస్వేచ్ఛ ప్రకటన పరిరక్షణ ఆందోళనల్లో భాగస్వాములవుతాం : యుఎస్పీసీ రౌండ్‌టేబుల్ సమావేశంలో కార్యాచరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మతోన్మాద మూకల దాడికి గురైన నిజామాబాద్ కోటగిరి హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు మల్లికార్జున్ కు న్యాయం చేయాలనే డిమాండ్‌తో హైదరాబాద్ మహా ధర్నా నిర్వహించనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసీ) తెలిపింది. మల్లికార్జున్‌పై దాడిని ఖండిస్తూ యుయస్పీసి స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, వై అశోక్ కుమార్, ఎం సోమయ్య, యు పోచయ్య, సయ్యద్ షౌకత్ అలీ, ఎన్ యాదగిరి, దూడ రాజనర్సుబాబు, ఎస్ హరికిషన్, బి కొండయ్య అధ్యక్ష వర్గంగా సోమవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం), సీపీఐ (ఎంఎల్ -న్యూడెమెక్రసీ), సీపీఐ (ఎంఎల్ - ప్రజాపంథా) నాయకులతో పాటు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఇదివరకే మల్లికార్జున్‌పై పెట్టిన బూటకపు కేసులను ఉపసంహరించాలనీ, దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయాలని డీజీపీతో పాటు సంబంధిత పోలీస్ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, మరో సారి కలిసి ఒత్తిడి పెంచాలని నిర్ణయిం చారు. అదే విధంగా భావస్వేచ్ఛ ప్రకటనా పరిరక్షణ కోసం ఏర్పడిన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 23న చేపట్టనున్న ఆందోళనల్లో భాగ స్వాములు కానున్నట్టు యుఎస్పీసీ నాయ కులు వెల్లడించారు.
ఉపాధ్యాయులు స్వేచ్ఛగా పాఠాలు బోధించే వాతావరణం కల్పించాలని సమావేశం డిమాండ్ చేసింది. శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీస్తున్న అరాచక శక్తులను నిలువరించేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. గణేష్ చందా ఇవ్వలేదనే కోపంతో మల్లికార్జున్‌ను వ్యక్తిగతంగానూ, కులం పేరుతో అవమానించారని సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం ఘటనను పోలీసులు అడ్డుకోకపోగా అరాచక శక్తులకు వత్తాసు పలకడం పట్ల విచారం వెలిబుచ్చింది. ఘటన జరిగి 15 రోజులు గడుస్తున్నా నిందితులను ఇంకా అరెస్ట్ చేయకపోవడమేంటని ప్రశ్నించింది. ప్రజాస్వామ్యవాదులు, సామాజికవాదులు ఇలాంటివి అడ్డుకోకపోతే పౌరులకు రాజ్యాంగ స్వేచ్ఛ లేకుండా పోయే ప్రమాద ముందని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మతం ముసుగులో చెలరేగిపోతున్న అరాచకశక్తు లను నిర్దాక్షిణ్యంగా అణచివేయా లని డిమాండ్ చేసింది. ఉపాధ్యాయ సంఘా లు, సామాజిక పౌర సంఘాలు, కార్మిక సంఘాలు కలిసి నింది తులను శిక్షించేవరకు ఐక్యంగా ఉద్యమించాలని సమావేశంలో నిర్ణయించారు.
పోలీసుల సమక్షంలో దాడి చేశారు....మల్లికార్జున్
గణేష్ చందా అడిగిన వారికి తాను ఇవ్వలేనని చెప్పడంతో ద్వేషం పెంచుకుని దాడి చేశారని బాధితుడు మల్లికార్జున్ తెలిపారు. తాను పాఠ్యాంశంలో ఉన్న భాగ్యోదయంలో భాగ్యరెడ్డి వర్మకు సంబంధించిన పాఠాన్ని పిల్లలకు బోధించాననీ, అందులో ఉన్న అంశాల మేరకు తాను మూఢ నమ్మకాలపై భాగ్యరెడ్డి వర్మ చేసిన పనులను వివరించానని తెలిపారు. దానితో తనపై మరింత కోపాన్ని పెంచుకుని ఈ నెల మొదట్లో తనపై పాఠశాల ఆవరణలోనే దాడికి తెగబడ్డారని చెప్పారు. అక్కడ్నుంచి బలవంతంగా దేవాలయానికి తీసుకెళ్లి, భజన చేయించి, బొట్టు పెట్టించి క్షమాపణ చెప్పించుకున్నారని తెలిపారు. కులం పేరుతో దూషిస్తూ, మతం మారుతారంటూ దుర్భాషలాడారని తెలిపారు.
సీపీఐ(ఎం) మీ వెంట...డీజీ నర్సింహారావు
వృత్తి పరిరక్షణ కోసం ఉపాధ్యాయులు చేసే ఉద్యమాలకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు తెలిపారు. మూకల దాడిని ఎదురొడ్డి బోధన చేస్తున్న మల్లికార్జున్‌కు అభినందనలు తెలిపారు. ఉపాధ్యా యుల పోరాటంలో తల్లిదండ్రులు, విద్యార్థులతో పాటు ప్రజలను భాగస్వాములను చేయాలని సూచిం చారు. న్యాయపోరాటం ఏ విధంగా చేయాలనే దానిపై ఆలోచించాలని
కోరారు.
మనువాదాన్ని తరిమికొట్టాలి...అలుగుబెల్లి నర్సిరెడ్డి
బడిలోకి వచ్చిన మన వాదాన్ని తరిమికొట్టాలని ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. మల్లి కార్జున్పై దాడి ఒక ఉపాధ్యా యుని పైనే దాడి కాదనీ, అది పాఠంపై, విద్యాసంస్థపై దాడి అని తెలిపారు. ఈ దాడిపై మౌనంగా ఉంటే మరిన్ని దాడులు జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ ఘటనను కోర్టు సుమోటోగా తీసుకో తగిన కేసుగా అభిప్రాయపడ్డారు. విద్యాలయాలను మత కేంద్రాలుగా మారుస్తున్న వారిపై సైద్ధాంతికంగా పోరాటం చేయాలని సూచించారు. పాఠశాలల్లో మత ప్రచారం చేయడం తగదని స్పష్టం చేశారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మల్లికార్జున్‌కు సహకారంగా, ఉపాధ్యాయ ఉద్యమంలో తానుంటానని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ (ఎంఎల్-న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్- న్యూడెమోక్రసీ) కార్యదర్శివర్గ సభ్యులు జె.వి.చలపతిరావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ (సీఐటీయూ), కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు, వీక్షణం వేణుగోపాల్, ప్రొఫెసర్ కాశీం, వినయబాబు, కోల జనార్దన్ ( స్వేచ్ఛ జేఏసీ), రమేష్ (విజ్ఞాన దర్శిని), కోయ వెంకటేశ్వరరావు (జన విజ్ఞాన వేదిక), టి సాగర్ (రైతు సంఘం), ఝాన్సీ (పీఓడబ్ల్యు), హన్మేష్ (ఐఎఫ్ టియు), జి అనురాధ (ఐఎఫ్ టియు), అభినవ్( కెఎన్ పిఎస్),ఎం శ్రీనివాస్, కె.సజయ, దేవి, జి ఝాన్సీ, పరుశరాం, బి సాంబశివరావు, అల్లూరి విజరు, అంబటి నాగయ్య, బి శివరాజ్, బొంగు ప్రసాద్ గౌడ్, జి అశోక్, టి లక్ష్మారెడ్డి, ఎం వినోద్ కుమార్, కస్తూరి ప్రభాకర్, సిఎం రావు, యు.వెంకట స్వామి, పి వెంకటయ్య, యుయస్పీసి స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, ఎం.రవీందర్, టి లింగారెడ్డి, ఎస్.మహేష్, ఎన్.దామోదర్, తదితరులు పాల్గొన్నారు.