Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాబార్డు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు నిరసన ర్యాలీలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్
- కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, నిరసనలు
నవతెలంగాణ-సిటీబ్యూరో/కంఠేశ్వర్
నిజామబాద్ జిల్లా కోటగిరిలో దళిత టీచర్ మల్లికార్జున్‌ను కులం పేరుతో దూషిస్తూ, బలవంతంగా గుడికి తీసుకెళ్ళి బొట్టు పెట్టించి, అతన్ని అవమానిస్తూ, గ్రామ వీధుల్లో ఊరేగించి, అనాగరిక చర్యలకు పాల్పడిన ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాద దుండగులు చేసిన దుశ్చర్యలను ఖండించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి, సామూహిక వినతి పత్రాలను అందించారు. అందులో భాగంగా హైదరాబాద్‌లో నాబార్డు బ్యాంక్ నుంచి ప్రదర్శన నిర్వహించి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు నిరసన తెలియ జేశారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. 4 నెలల కిందట మల్లిఖార్జున్ అనే టీచర్ వినాయక చవితికి చందా ఇవ్వలేదనే కక్షతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు ఈ ఘోరానికి ఒడిగట్టారని, మల్లిఖార్జున్‌ను అత్యంత అమానుషంగా కించపర్చారన్నారు. బడి నుంచి గుడి వరకు బలవంతంగా మెడలు పట్టి కొట్టుకుంటూ లాక్కెళ్ళి జైశ్రీరామ్ అని అనాలని ఒత్తిడి చేస్తూ, అతనికి బొట్టు పెట్టి మనోభావాలను దెబ్బతీసి, కులం పేరుతో దూషించి తీవ్రమైన పరుష పదజాలాలతో హేళన చేయడం దుర్మార్గమన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివృద్ధి సాధించినప్పటికీ సాటి మనిషిని, మనిషిలాగా చూడలేని దుర్మార్గపు స్థితి బీజేపీ పాలనలో సర్వసాధారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలగుడు భాస్కర్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులు, మైనార్టీలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నదని, మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఊనా పట్టణంలో ఆవు మాంసం వలుస్తున్నారనే నెపంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టి, తమ కారుకి కట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని, ఒక దళితుడు గుర్రం ఎక్కాడని కిందపడేసి కొట్టి చంపారని, యూపీలో ఓ దళిత యువతిని హత్రస్‌లో సామూహిక లైంగికదాడి చేసి, నాలుక కోసి, నడుములు విరిచినా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా తీసుకోలేదన్నారు. హాస్పిటల్లో బాధితురాలు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణిస్తే కనీసం ఆ శవాన్ని కూడా కుటుంబానికి ఇవ్వలేదని, ఇలాంటి దారుణాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరెన్నో జరుగుతున్నాయని గుర్తుచేశారు. వీటన్నింటిలో భాగంగానే కోటగిరి స్కూల్ టీచర్ మల్లిఖార్జున్‌పై దాడి జరిగిందన్నారు. తెలంగాణలో 70 కుల దురహంకార హత్యలు జరిగాయని, మంథని మధుకర్, ఆంబోజి నరేష్, పెరుమాండ్ల ప్రణరు వంటి హత్యలు రాష్ట్రాన్ని కుదిపేశాయన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీల) పేరుతో సాంఘిక బహిష్కరణలు జరుగుతున్నాయని, ఇలాంటి ఘటనల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, దాడికి పాల్పడిన దుండగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.రమ, భూపాల్, రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేష్, ఎం.వెంకటేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, పి.సుధాకర్, పి.సునీత, ప్రసాద్, హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షులు జె.కుమార్, కోశాధికారి ఆర్.వాణి, సిటీ నాయకులు రాములు, సత్తయ్య, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఏవో ప్రశాంత్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జంబిశెట్టి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. దళిత టీచర్ మల్లికార్జున్‌పై పోలీసుల సమక్షంలో దాడి జరుగుతున్నప్పటికీ పట్టించుకోకుండా వ్యవహరించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక లౌకికవాదులు ప్రశ్నిస్తే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని, వారిపై దేశద్రో హులుగా ముద్ర వేసి దేశం విడిచి పోవాలని బెదిరిస్తు న్నారని అన్నారు. ఈ చర్యలను నిరసిస్తూ ప్రజాస్వామిక లౌకికవాదులు ఏకమై పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ ఉపాధ్యక్షులు రమేష్ బాబు, జిల్లా సహాయ కార్యదర్శి మల్యాల గోవర్ధన్, చక్రపాణి మోహన్, నన్నేసాబ్, డి. కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యేశాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.