Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.750 కోట్లతో అలాక్స్ బ్యాటరీ తయారీ పరిశ్రమ
- దావోస్ వాణిజ్య సదస్సులో ప్రకటించిన సంస్థలు
- స్వాగతించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దావోస్ అంతర్జాతీయ వాణిజ్య సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఇదే వేదికపై తెలంగాణలో తన కార్యకలాపాలను రెట్టింపు చేయనున్నట్లు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ పెప్సికో ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కే తారక రామారావుతో జరిగిన సమావేశంలో పెప్సికో సంస్థ ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయాన్ని తెలియచేశారు. హైదరాబాద్ కేంద్రంగా పెప్సీకో నిర్వహిస్తున్న గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్‌ను విస్తరించి కార్యకలాపాలను రెట్టింపు చేస్తామన్నారు. కేవలం 250 మందితో 2019లో ప్రారంభమైన గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్లో ప్రస్తుతం 2,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారనీ, ఈ సంఖ్యను నాలుగువేలకు పెంచనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన పెట్టుబడి గణాంకాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో పెప్సికో కార్పొరేట్ కార్యకలాపాల కార్యనిర్వాక ఉపాధ్యక్షులు రాబర్టో అజేవేడో మంత్రి కేటీఆర్‌తో చర్చించాక ఈ ప్రకటన చేశారు. ఈ నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టే విషయాన్ని పరిశీలించాలని సూచించారు.
750 కోట్లతో బ్యాటరీ తయారీ పరిశ్రమ
అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రయివేట్ లిమిటెడ్ మల్టీ గిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రాన్ని రూ.750 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మౌర్య సుంకవల్లి మంత్రి కేటీఆర్‌తో చర్చలు జరిపారు. దీనివల్ల 600 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కే తారకరామారావు సమక్షంలో అలాక్స్ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలి విడతగా రూ. 210 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు. 2030 నాటికి మొత్తం రూ.750 కోట్లను ఈ కేంద్రంపై పెట్టుబడిగా పెడతామన్నారు. అలాక్స్ సంస్థ నిర్ణయం పట్ల మంత్రి కే తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు రాష్ట్రంలో తయారీ ఈకో సిస్టంను పెంచేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ఈవీ సెక్టార్ డైరెక్టర్ ఆటోమోటివ్ వీసీ గోపాలకష్ణన్ పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి కేటీఆర్ పలు హెల్త్ కేర్ కంపెనీల అధిపతులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ ప్రోత్సాహం, ఇప్పటికే స్థాపితమైన పలు అంతర్జాతీయ కంపెనీల వివరాలను ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.