Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమే కాకుండా.. నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యల అభిమానం, ఆప్యాయత, ప్రేమ ఎంతో ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. వారి వాత్సల్యం పిల్లల ఎదుగుదలకు దోహదం చేస్తుందని చెప్పింది. పిల్లల సంరక్షణ అంటే డబ్బు మాత్రమే కాదని స్పష్టంచేసింది. పలు దృక్కోణాల్లో చూడాలని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పు చెప్పింది. మొదటి భార్య(ఓ చిన్నారి తల్లి) మరణించడంతో నల్లగొండకు చెందిన ఓ వ్యక్తి రెండో వివాహం చేసుకున్నాడు. ఆ చిన్నారి ప్రస్తుతం తండ్రి వద్దే ఉంటోంది. చిన్నారిని చూసేందుకు అనుమతివ్వాలని అమ్మమ్మ వినతిని ఆ జిల్లా కోర్టు తిరస్కరించడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మనమరాలిని వారంలో రెండు గంటల పాటు చూసేందుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత అనుమతినిచ్చారు. అల్లుడు, అత్తల మధ్య వివాదాలు పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపకూడదని అన్నారు. అమ్మమ్మ తన మనవరాలిని వారానికోసారి కలవడానికి అనుమతివ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.