Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో దారుణాలపై ఉన్నతస్థాయి కమిటీ వేయాలి : టీడీపీ అధ్యక్షులు కాసాని
నవతెలంగాణ -హైదరాబాద్
శస్త్ర చికిత్సకు ఉపయోగించే కిట్లకు స్టెఫలో కొకస్ బ్యాక్టీరియా వ్యాపించడం వల్లే ఇటీవల మలక్పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతి చెందినట్టు విచారణ కమిటీ ప్రాథమిక నివేదికలో నిగ్గు తేలడం బీఆర్ఎస్ ప్రభుత్వ అధ్వాన్న పనితీరుకు నిదర్శనమని టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ విమర్శించారు. అదే రోజు మరో 18 మందికి డెలివరీ అయ్యాక ఇన్స్ఫెక్షన్ సోకడంతో వారిని మెరుగైన చికిత్స కోసం వైద్యులు నిమ్స్ కు తరలించారనీ, ఇందులో ఇద్దరు మహిళల కిడ్నీలకు ఇన్స్ఫెక్షన్ సోకి దయాలిసిస్ జరుగుతున్నదని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో నలుగురు బాలింతలు, పేట్ల బురుజు ఆసుపత్రిలో మరో మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సందర్భంగా ఇలాంటి ఇన్స్ఫెక్షన్ కారణంగా దుర్మరణం చెందినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం దారుణమన్నారు. బాధిత కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం అందజేయాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం అలసత్వాన్ని వీడి ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించేందుకు వెంటనే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లలో అత్యాధునిక పరికరాలను, మెరుగైన వసతులను యుద్దప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కోరారు.