Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోషల్ మీడియాలో వైరల్
హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ వివాదంలో చిక్కుకున్నారు. ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై దాడి చేసి చేయి చేసుకున్న వీడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్న భగీరథ్ తోటి విద్యార్థిపై చేయి చేసుకోవడమే కాకుండా దూషించడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. భగీరథ్ స్నేహితుడు కూడా విచక్షణ రహితంగా బాధితుడిపై దాడి చేశాడు. దీనికి సంబంధించి భగీరథపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మహీంద్రా వర్సిటీకి చెందిన విద్యార్థిపై బండి భగీరథ దాడి చేసినట్టు విశ్వవిద్యాలయ క్రమశిక్షణా సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. కొన్ని రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దుండిగల్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ 341, 322, 504, 506, 34 సెక్షన్ల కింద భగీరథ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బాలానగర్ డీసీపీ సందీప్ రావ్ వెల్లడించారు. మహీంద్రా యూనివర్సిటీ ఇచ్చిన ఆధారాల ప్రకారం కేసు విచారణ జరుపుతామని తెలిపారు. ఈ ఘటన తెలంగాణలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే, పాత వీడియోను ఇప్పుడు బయటపెట్టారంటూ బాధిత విద్యార్థి శ్రీరామ్ తాజాగా ఒక ప్రకటన చేయడం గమనార్హం. తాను భగీరథ, నేను ఇప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్ అని.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ చెప్పడం గమనార్హం.
కఠినంగా శిక్షించాలి : ఎస్ఎఫ్ఐ
మహీంద్రా యూనివర్సిటీలో కొత్తగా చేరిన విద్యార్ధిని ర్యాగింగ్ చేసి బూతులు తిడుతూ, భౌతికంగా దాడి చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూమార్ కుమారుడు సాయి భగిరథ,అతని మిత్రులను కఠినంగా శిక్షించాలనీ, తక్షణమే అరెస్ట్ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఎస్ ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్య దర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు.