Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాస్టర్‌ప్లాన్‌తో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన
నవతెలంగాణ-కామారెడ్డి టౌన్
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రైతుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. ఇప్పటికే సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు పయ్యావుల రాములు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే మరొక రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మర్రిపల్లి బాలకృష్ణ, సంతోష్ ఇద్దరు అన్నదమ్ములు. వీరికి సర్వే నంబర్ 89లో ఎకరం భూమి ఉంది. అయితే బాలకృష్ణకు ఇద్దరు ఆడపిల్లలు (కవలలు) మిధున, మేఘన ఉన్నారు. ప్రస్తుతం వారు తాడ్వాయి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. అయితే ఇద్దరు పిల్లలు డాక్టర్ చదువు కోసం ప్రయత్నిస్తున్నారు. దానికోసం తన భాగం భూమిని అమ్మడానికి ప్రయత్నించగా గతంలో రూ.70 లక్షలు పలికింది. ఇప్పుడు మాస్టర్‌ప్లాన్‌తో గ్రీన్‌జోన్‌లోకి తన భూమి రావడంతో రూ.20 లక్షలకు కూడా అడగడం లేదు. దాంతో తన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని మనస్తాపం చెందిన బాలకృష్ణ గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయం వద్ద గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి ఇంటికి వచ్చి విషయం చెప్పాడు. దాంతో అతన్ని హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు.
విషయం రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులకు తెలియడంతో ఆస్పత్రికి వెళ్లి బాలకృష్ణను పరామర్శించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అతన్ని ఎల్లారెడ్డిపేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా రైతు బాలకృష్ణ భార్య లక్ష్మీ మాట్లాడుతూ.. తమ భూమి మాస్టర్ ప్లాన్‌లో గ్రీన్ జోన్లో పోతుందని తెలిసి తన భర్త ఆవేదనకు గురయ్యాడన్నారు. నెల రోజులుగా రైతులతో కలిసి ఉద్యమంలో కూడా పాల్గొంటున్నాడని తెలిపారు. తమ భూమి మాస్టర్ ప్లాన్‌లో పోకుండా చూడాలని ఆమె వేడుకుంది.