Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ ఆధ్వర్యంలో వర్ధంతి
నవతెలంగాణ-ముషీరాబాద్
మనువాదుల, మతోన్మాదుల కుట్రలకు హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో దళిత రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల వ్యవస్థీకృత హత్యకు గురయ్యాడని, మనువాదంపై ఐక్య పోరాటమే ఆయనకు నివాళి ఆని పలువురు వక్తలు అన్నారు. బుధవారం రోహిత్ వేముల ఏడో వర్ధంతి సందర్భంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఆయన చిత్రపటానికి కేవీపీఎస్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.సాగర్, బొజ్జ బిక్షమయ్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యా లయంలో దళిత విద్యార్థులను ఉన్నత చదువుల నుంచి దూరం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు. యూనివర్సిటీలోని దళిత విద్యార్థులకు రావాల్సిన ఫెలోషిప్పులను వైస్ ఛాన్స్లర్ నిలిపివేశారని, దాన్ని నిర సిస్తూ వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారని చెప్పారు. యూనివర్సిటీల్లో భావప్రకటన స్వేచ్ఛకు కూడా భంగం కలిగిస్తున్నారని తెలిపారు. నాడు విద్యార్థులపై, నేడు ఉపాధ్యాయులపై కూడా హింసకు పాల్పడుతున్నారని చెప్పారు. నాటి యూనివర్సిటీ వీసీ అప్పారావు యూనివర్సిటీ నుంచి నలు గురు దళిత విద్యార్థులను వెలి వేయడంతో క్యాంపస్లో వెలివాడను ఏర్పాటు చేసుకొని రోహిత్ వేముల న్యాయం కోసం పోరాడారని గుర్తుచేశారు. రోహిత్ వేముల పోరాట స్ఫూర్తితో మనువాదం, మతోన్మాదంపై బీజేపీ ప్రభుత్వం కాషాయపు విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్, అంబేద్కరిస్ట్ డాక్టర్ మంచాల మహేశ్వర్, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.