Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పక్కగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రి తన కార్యాలయంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియపై మంత్రి సమీక్షించారు. పూర్తి పారదర్శకతతోనూ, జవాబుదారీతనంతోనూ, లోపాలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. మార్గదర్శకాలు, షెడ్యూల్‌కు సంబంధించి త్వరితగతిన తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకొవాలని చెప్పారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం అనుమతినిచ్చినందున ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సజావుగా పూర్తయ్యేలా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఉపాధ్యాయ బదిలీలకు చర్యలు తీసుకుంటున్నందున ఇందుకోసం వినియోగించే సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. పదోన్నతులు, బదిలీల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదనీ, ఈ ప్రక్రియకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు రాష్ట్ర స్థాయి అధికారులను ఆయా జిల్లాల్లో పర్యవేక్షలుగా నియమించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ దేవసేన తదితరులు పాల్గొన్నారు.