Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
జనవరి 28 నుంచి జూన్ 17 వరకు జరగనున్న జీ 20 దేశాల వర్కింగ్ గ్రూపు సమావేశాలను విజయవంతంగా నిర్వహించడానికి సమన్వయంతో పని చేయాలని జీ 20 సెక్యూరిటీ కో ఆర్డినేషన్ కమిటీలో నిర్ణయించారు. రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అధ్యక్షతన డీజీపీ కార్యాలయంలో జీ 20 సెక్యూరిటీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు ఏయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా , రీజినల్ పాస్ పోర్టు అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఆర్ డీఎఫ్,సీఐఎస్ఎఫ్, ఎన్ఎస్జీ తదితర భద్రతా సంబంధిత శాఖలకు చెందిన ఉన్నతాధికారుతో సమావేశమయ్యారు. ఈ సంధర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రపంచంలో మూడింట రెండొ వంతు జనాభాను కవర్ చేయడంతో పాటు ప్రపంచంలోని 85 శాతం జీడీపీ , 75 శాతం గ్లోబల్ వాణిజ్యాన్ని శాసించే 29 దేశాలు సభ్యులుగా ఉన్న అత్యంత ప్రతిష్టాత్మక జీ 20 దేశాల అధినేతలు పాల్గొనే ఈ సమావేశం హైదరాబాద్‌లో సైతం జరగడం తమకు అత్యంత ప్రాధాన్యతను కలిగించిందని అన్నారు. ప్రధాని మోడీ అధ్య క్షతన సెప్టెంబర్‌లో జరగనున్న ఈ సమావేశానికి భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చేయడం తమకు ఛాలెంజ్ వంటిదని అన్నారు. ఈ అత్యున్నత సమావేశానికి ముందస్తుగా దేశంలోని 56 నగరాలలో 215 వర్కింగ్ గ్రూపు సమావేశాలు నిర్వహిస్తున్నామని డీజీపీ తెలిపారు. దీనిలో భాగంగా ఆరు సమావేశాలు హైదరాబాద్‌లో జరగనున్నాయని ఆయన వివరించారు. జనవరి 28న తొలి సమావేశం జరగనున్నదనీ , మార్చి ఆరు , ఏడు , ఏప్రిల్ 26,27,28 తేదీలు, జూన్ 7, 8,9, 15,16,17 తేదీలలో వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యాన వర్కింగ్ గ్రూపు సమావేశాలు జరుగనున్నాయని ఆయన తెలిపారు. ఈ సమవేశాలకు మంత్రులు, , కార్యదర్శులు, జాయింట్ సెక్రెటరీలు, క్షేత్ర స్థాయి నుంచి మొదలుకుని స్వచ్చంద సంస్థల ప్రతినిధులు హాజరవుతారని డీజీపీ వివరించారు. ఈ సమావేశాలు ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా సజావుగా నిర్వహించడానికి వివిధ భద్రతా విభాగాల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. ముఖ్యంగా ఈ సమావేశాలకు హాజరయ్యే ప్రముఖులు నగరంలోని వివిధ పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశాలు ఉన్నాయని, వాటి వద్ద కూడా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉన్నదని డీజీపీ పేర్కొన్నారు. ఈ విషయంలో అంతర్గత వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుని సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధులు మొదలుకుని ఇతరుల వరకు వారికిచ్చిన గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఆ తర్వాతే లోనికి అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా ఏయిర్‌పోర్టులు, హౌటళ్లు, సమావేశాలు జరిగే ప్రాంతాలవద్ద ప్రతినిధులకు ఎలాంటి సెక్యూరిటీ సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని నగర పోలీసు కమిషనర్, సైబరాబాద్ సీపీలను డీజీపీ ఆదేశించారు. సెక్యూరిటీ సమన్వయం కోసం ఏయిర్ పోర్టుతో పాటు, నగరంలో ప్రత్యేకంగా మూడు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు డీజీలు,అభిలాషబిస్త్, సంజరుకుమార్ జైన్, స్వాతి లక్రా, విజరుకుమార్, నాగిరెడ్డి, సైబరాబాద్ సీపీ స్టీఫెన్రవీంద్ర, నగర అదనపు పోలీసు కమిషనర్ విక్రంసింగ్ల మాన్, డీఐజీ తప్సిల్ ఇక్భాల్, ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు, కేంద్ర హౌంశాఖ ఎ స్‌ఐబీ డీడీ సంబల్ దేవవ్, రాజీవ్ గాంధీ ఏయిర్ పోర్టు సీఎస్ఓ భరత్ కందర్, డీప్యూటీ పాస్‌పోర్టు అధికారి ఇదు భూషన్, ఎన్డీఆర్ఎఫ్ అధికారి దామోదర్ సింగ్, సీఐఎస్ఎఫ్ అధికారి సింగన రారు, ఎన్ఎస్జీ అధికారి కల్నల్ ఆలోక్ బీస్త, తదితర అధికారులు పాల్గొన్నారు.