Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
- డైరక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మోడల్ హాస్టల్ సిబ్బందికి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవో 60 వర్తింప చెయ్యకపోవడం, 24 గంటలు హాస్టల్లో ఉండి పని చెయ్యలని ఒత్తిడి చేస్తుండటంతో వారు తీవ్రమైన మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకే అవరణం, ఒకే రకమైన పని చేస్తున్న సిబ్బందికి వేర్వేరు జీతాలు, వేర్వేరు జీవోలు అమలు చేయడం చాలా దుర్మార్గం. కాబట్టి జీవో 60 తక్షణమే అమలు చేయాలని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. సోమవారం ఆ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ ఎడ్ల రమేష్, నాయకులు సంతోష, సుజాత,రజిత,సునీత, శరోజన,లావణ్య,వందన తదితరుల నేతృత్వంలో సోమవారం హైదరాబాద్లోని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీనివాస్ వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జె. వెంకటేష్ ''మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర మోడల్ స్కూల్, హాస్టల్స్లో బోధనేతర సిబ్బంది అతి తక్కువ వేతనాలతో గత తొమ్మిదేండ్లుగా పని చేస్తున్నారు. ఇదే హాస్టల్ అవరణలో స్కూల్ నాన్ టీచింగ్కి తెలంగాణ ప్రభుత్వ జీవో 60 అమలు చేస్తున్నారు. కానీ హాస్టల్ వారికి అమలు చేయకపోవటం అన్యాయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ 2022 నవంబర్ 27న జీవో నెంబర్ 117 ప్రకారం వేతనాలు ఇస్తున్నట్టు తెలిపింది. దీనిపై ఆన్ని హాస్టల్ ప్రిన్సిపల్, జిల్లా విద్యా శాఖ అధికారులకు ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ కూడా జారీ చేశారు. వీటిని కొన్ని జిల్లాలో అమలు చేస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో అమలు చేయడం లేదు. వీరికి ఎరియర్స్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. సర్వ శిక్ష అభియాన్ పథకంలో ఉద్యోగులకు వర్తించే ప్రతి జీవో, సర్క్యులర్ వీరికి అమలు చేయాలి. కేజీబీవీల్లో అమలు చేస్తున్న జాబ్ చార్ట్, సెలవులు అమలు చేయాలని ...'' డిమాండ్ చేశారు. ''మోడల్ స్కూల్ తరహాలో జీవో 60 హాస్టల్ వారికి కేర్ టేకర్లకు రూ.22,750, ఏఎన్ఎంలకు రూ. 19,500, వాచ్మెన్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్కేవెంజర్లకి రూ.15,600 ఇవ్వాలి. జాబ్ చార్ట్ ఇవ్వాలి. 24 గంటల పని విధానం రద్దు చేయాలి. జీవో నెంబర్ 117 ఎరియార్స్ వెంటనే ఇవ్వాలి. హాస్టల్ బడ్జెట్తో సంబంధం లేకుండా జీతాలు ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ జమ చేయాలి. కామారెడ్డి జిల్లాలో 2020 ఏప్రిల్ నుంచి 2012 జనవరి వరకు 10 నెలల పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలి. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి. కేజీబీవీ ఎస్ఓలనులను తొలగించి కేర్ టేకర్స్నీ వార్డెన్లుగా నియమించాలి. ఏఎన్ఎంలకు ప్రభుత్వ స్టాఫ్ నర్సుల రిక్రూట్మెంట్ జీవో 16 లో వెయిటేజీ ఇవ్వాలి. హాస్టల్ సిబ్బందికి ఫర్నిచర్, ఫోన్ సౌకర్యం కల్పించాలి. పిల్లలకి సరిపడినంతగా మందులు ఏఎన్ఎంలకు సరఫరా చేయాలని...''ఆయన కోరారు. లేకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాల సమయంలో చలో హైదరాబాద్ నిర్వహించి తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు.