Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలే అప్రమత్తంగా ఉండాలి
- ఎస్వీకే వెబినార్‌లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు అరుణ్‌కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారతదేశంలోనూ బ్రెజిల్ తరహా పరిణామాలు సంభవించే ప్రమాదం ఉన్నదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు అరుణ్‌కుమార్ హెచ్చరించారు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్స్‌నారో అవలంబించిన విధానాలనే భారతదేశంలోనూ ప్రధాని నరేంద్రమోడీ అమలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ట్రంప్ ఓటమి పాలయ్యాక, అక్కడి పార్లమెంటు భవనంపై ఆయన మద్దతు దారులు దాడులు చేశారనీ, అదే తరహాలో ఇప్పుడు బ్రెజిల్‌లోనూ బోల్స్‌నారో మద్దతు దారులు దాడులకు తెగబడ్డారని వివరించారు. అమెరికా, బ్రెజిల్ ఆర్థిక విధానాలు ఒక్కటేననీ, ఇప్పుడు భారతదేశ ఆర్థిక విధానాలు కూడా వాటికోవలోనే ఉన్నాయని చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ''బ్రెజిల్ ప్రజాతీర్పు. వ్యతిరేకిస్తున్నదెవరు? కారణాలేంటి?'' అంశంపై మంగళవారం జరిగిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ట్రంప్, బోల్స్‌నారో ఇద్దరీకి ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థలపై నమ్మకం లేదనీ, అందుకే ఆ వ్యవస్థల్ని సాధ్యమైనంత ఎక్కువగా నిర్వీర్యం చేసే చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. ఇప్పుడు భారతదేశంలోనూ ఇదే తరహా పరిణామాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. బ్రెజిల్లో పర్యావరణ ప్రమాదాన్ని పట్టించుకోకుండా అమెజాన్ అడవుల్లో సోయాబీన్ కమతాలను భూస్వాములు, కార్పొరేట్లకు కట్టబెట్టారనీ, దానికి తోడు ఆ అడవుల్లోని ఖనిజ సంపదకోసం మైనింగ్ ముఠాలు సిద్ధమయ్యాయనీ, దానికి అవససరమైన అనుమతులను బోల్స్‌నారో ఇచ్చారని గుర్తుచేశారు. చర్చి పేరుతో ప్రజల్లో విభజన తెచ్చే ప్రయత్నం బోల్స్‌నారో చేశారని చెప్పారు. ఇప్పుడు లూలాకు వ్యతిరేకంగా జరిగిన దాడులకు ఆర్థిక సహకారం అందించింది వారేననే ప్రాథమిక నిర్థారణ ఉన్నదనీ చెప్పారు. భారతదేశం-బ్రెజిల్ ఘటనలు, అమలవుతున్న విధానాలకు భావసారూప్యత ఉన్నదని చెప్పారు. భారతదేశంలోనూ అడవులను అదానీ, అంబానీలకు కట్టబెట్టారనీ, మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారనీ, రిటైర్డ్ సైనికాధికారులను ప్రభుత్వంలో నియ మించుకుంటున్నారనీ, అగ్నిపథ్ పేరుతో సైన్యాన్ని తమ కనుసన్నల్లో ఉంచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని విశ్లేషించారు. బ్రెజిల్లో గతంలో లూలా నేతృత్వంలోని ప్రభుత్వం అనేక సమస్యలు పరిష్కరించి, ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందించిందని చెప్పారు. బోల్స్‌నారో దేశాధ్యక్షుడు అయ్యాక ఆ విధానాలను కాదని, పూర్తిగా అమెరికా కనుసన్నల్లో పనిచేశారన్నారు. కోవిడ్ టైంలో అమెరికా తర్వాత ఎక్కువ మంది మరణించింది బ్రెజిల్లోనేనని తెలిపారు. వైద్యరంగంలో బోల్స్‌నారో ఎలా విఫలమయ్యారో ఇదే నిదర్శనమన్నారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం బ్రెజిల్‌ను వెనక్కి నెట్టిందనీ, బోల్స్‌నారోను కాదని అక్కడ ప్రజలు తిరిగి లూలాకు పట్టం కట్టారని వివరించారు. బోల్స్‌నారోకు ట్రంప్‌కు భావసారూప్యం ఉందనీ, ఇద్దరూ ఉదారవాద ఆర్ధిక విధానాలతో తిరోగమన, నియంతృత్వ భావాలు కలిగిన వారేనని చెప్పారు. ఇప్పుడు ప్రధాని మోడీ కూడా వీరి సరసన చేరారని అన్నారు. బ్రెజిల్లో దాడులకు ఆర్థిక వనరులు సమకూర్చిన వారినీ వదిలిపెట్టబోమని లూలా హెచ్చరించారని చెప్పారు. బ్రెజిల్ ఎన్నికల్లో సైన్యం జోక్యం చేసుకోవాలని బోల్స్‌నారో మద్దతుదారులు అక్టోబర్ నుంచి అక్కడి కంటోన్మెంట్ ఏరియాల్లో ధర్నాలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారని వివరించారు. కార్యక్రమానికి సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు.