Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ చలాన్లు నిలువరించండి
- తిరుపతికి ఎంప్లాయీ పాస్ అనుమతించాలి : టీఎస్ఆర్టీసీ ఎమ్డీ సజ్జనార్‌కు ఎస్‌డబ్ల్యూఎఫ్ వినతి
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
టీఎస్ఆర్టీసీలో అర్హత కలిగిన ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ ఆప్షన్‌ను అనుమతించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) డిమాండ్ చేసింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు ఇటీవలికాలంలో ట్రాఫిక్ పోలీసుల చలాన్లు వస్తున్నాయనీ, వాటిని నిలువరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌కు ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు మూడు ప్రధాన అంశాలపై వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు. ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల్లో అనేకమందికి హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చారనీ, 16,307 మందికి 2006 నుంచి 2014 వరకు వారి జీతాల్లో ఆ పెన్షన్ల కోసం రికవరీలు చేశారని తెలిపారు. 2014 ఆగస్టు 31న వారందరికీ హయ్యర్ పెన్షన్‌ను తిరస్కరిస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారనీ, ఈ ఉద్యోగుల్లో టీఎస్ఆర్టీసీకి చెందిన 7,373 మంది ఉన్నారని వివరించారు. రికవరీ చేసిన సొమ్మును తిరిగి చెల్లించలేదనీ, కోర్టు ఉత్తర్వుల ప్రకారం వారందరికీ ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. కార్మికులు చెల్లించాల్సిన సొమ్ము ఏదైనా ఉంటే వారికి సమాచారం ఇవ్వాలనీ, దీనివల్ల వారు ఆ సౌకర్యాన్ని నష్టపోకుండా ఉంటారని విజ్ఞప్తి చేశారు.
అలాగే తిరుపతికి వెళ్లే బస్సుల్లో ఎంప్లాయీ బస్‌పాస్‌ను అనుమతించట్లేదనీ, ఆ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆర్టీసీ బస్సుల్లో రోజుకు వెయ్యి మంది ప్రయాణీకులకు శ్రీఘ్రదర్శనం టిక్కెట్లు ఇస్తున్నారనీ, దీనికి మంచి స్పందన వస్తున్నదని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కూడా బస్‌పాస్ ప్రయాణానికి అనుమతి ఇచ్చి, కుటుంబసభ్యులకు కూడా దర్శనం టిక్కెట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనల పేరుతో ఆర్టీసీ డ్రైవర్లకు భారీ సంఖ్యలో చలాన్లు వస్తున్నాయనీ, పోలీసులతో మాట్లాడి వీటిని నిలువరించే చర్యలు తీసుకోవాలని మరో లేఖలో కోరారు. రాంగ్ పార్కింగ్, ఓవర్టేక్, సిగల్ జంపింగ్ వంటి పేర్లతో ఈ చలాన్లు వస్తున్నాయని తెలిపారు. మెజారిటీ చలాన్లు హైదరాబాద్ సిటీలోనే ఉన్నాయని చెప్పారు. సిటీలో బస్సులు నడపడం డ్రైవర్లకు కత్తిమీద సాముగా ఉంటుందనీ, తొలగించిన బస్టాపుల్ని పునరుద్ధరించి, రద్దీకి అనుగుణంగా రన్నింగ్ టైం నిర్థారించాలని కోరారు.