Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సచివాలయ ఉద్యోగి దుర్మార్గం : మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
నవతెలంగాణ-మెదక్ రూరల్
బీమా కోసం ఓ వ్యక్తిని హత్య చేసి.. కాల్చి వేసి.. తానే మరణించినట్టు నమ్మించిన ఓ సచివాలయ ఉద్యోగి దుర్మార్గాన్ని మెదక్ పోలీసులు ఛేదించారు. తాను మరణిస్తే వచ్చే కోట్ల రూపాయల బీమాతో ప్రయోజనం పొందాలనుకున్న ఉద్యోగి పాత్లోత్ ధర్మను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని హెచ్చరించారు. ఈ నెల 9న మెదక్ జిల్లా టేక్మాల్ పోలీసుస్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ గ్రామ శివారులో జరిగిన కారు దగ్ధం, వ్యక్తి దహనం కేసులో విస్తుపోయే వాస్తవాలను బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మీడియాకు వెల్లడించారు. ధర్మ కేసులో ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేసి ఛేదించామన్నారు.
టేక్మాల్ మండల్ వెంకటాపూర్, భీమ్లా తండాకు చెందిన పాత్లోత్ ధర్మ.. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదలశాఖలో సహాయ సెక్షన్ అధికారిగా (ఏఎస్వో) పనిచేస్తూ కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో 2018లో షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో మంచి లాభాలు రావడంతో పెట్టుబడులు మరింత పెంచాడు. అనంతరం భారీ నష్టాలను చవిచూడాల్సి రావడంతో చిట్‌ఫండ్ కంపెనీలో చిట్టీలు వేస్తూ తద్వారా వచ్చిన సొమ్ముని షేర్ మార్కెట్లో మళ్లీ పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టాడు. మళ్లీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఇలా ఆన్లైన్ బెట్టింగులు, షేర్‌మార్కెట్, చిట్టీలకు అలవాటుపడటంతో అతని అప్పులు రూ.85 లక్షల వరకు చేరాయి. ఈ అప్పుల నుంచి ఏదో ఒక మార్గం ద్వారా బయట పడాలని నిర్ణయించుకొని ఆరు నెలల కిందట నుంచి అతని పేరుమీద దాదాపు 25 ఇన్సూరెన్స్‌లు కడుతున్నాడు. వాటి విలువ సుమారు రూ.7.40 కోట్లు ఉంటాయి. దాంతో తాను చనిపోతే వచ్చే బీమా డబ్బుల తో అప్పులు తీర్చొచ్చనే ఆలోచన చేశాడు. ఈ క్రమంలో అతని కుటుంబ సభ్యులతో చర్చిస్తూ ఒక పథకాన్ని రూపొందించాడు. ఈ పథకం ప్రకారం అతని లాగే ఉన్న మరో వ్యక్తిని చంపి దాని ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో అప్పుల నుంచి బయటపడొచ్చనే మార్గాన్ని ఆలోచించాడు. కాగా, అతని లాగే ఉండే అంజయ్యను నాంపల్లి మెట్రో స్టేషన్లో 2022 నవంబర్‌లో గుర్తించిన ధర్మ.. వారి తోటలో ఉద్యోగం ఉందని. రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు జీతం ఇస్తామని అంజయ్యని నమ్మించి వారి వెంట తీసుకెళ్లారు. అంజయ్య మద్యం మత్తులో ఉన్నాడని గమనిం చిన ధర్మా, అతని అక్క కొడుకు శ్రీనివాస్.. అతన్ని చంపితే ఇన్సూరెన్స్ డబ్బులు రాకపోవచ్చని, పన్నాగాన్ని వాయిదా వేసి అంజయ్యను నిజామా బాద్‌లోని స్టార్‌లైట్ లాడ్జీకి తీసుకెళ్లి ఆ రాత్రికి అక్కడే బస చేశారు. కాగా, భోజనం చేసేందుకు బయటకువెళ్లిన అంజయ్య తిరిగి రాకపోవడంతో వారి హత్యా పథకం బెడిసికొట్టింది. ఈ సారి మరో పథకం రచించి.. ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేశారు. అనం తరం జనవరి 8 ఉదయం ధర్మ.. నిజామాబాద్ రైల్వేస్టేషన్ అడ్డాపై 40 నుంచి 45 ఏండ్ల వయస్సున్న బాబు అనే వ్యక్తిని సంప్రదించారు. రోజు కూలీ డబ్బులు ఇస్తామని చెప్పి బాబును బాసరకు తీసుకెళ్లి గుండు కొట్టిం చారు. అక్కడి కారులో ముగ్గురు కలిసి టెక్మాల్ మండలం వెంకటాపూర్ శివారుకు వచ్చే వరకు మత్తులో ఉండే విధంగా కల్లు తాగించారు. 8వ తేదీ రాత్రి 11.50 గంటలకు చేరుకున్న వారు.. కారులోపల, బయట ప్రధాన నిందితుడు పెట్రోల్ పోసి ఆ వ్యక్తిని ముందర కూర్చోవాలని చెప్పడంతో అనుమా నించిన బాబు అందుకు ఒప్పుకోలేదు. దాంతో కారు లో ఉన్న గొడ్డలితో బాబుని హత్య చేసి కారు ముందు సీట్లో కూర్చో బెట్టి పెట్రోల్ పోసి తగులబెట్టి వారు పరారయ్యారు. ఉదయాన్నే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. విచారణ చేపట్టగా.. ఈ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. దాంతో ఈనెల 17న నిందితులు మెదక్ వస్తు న్నారనే పక్కా సమాచారం తో వారిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. ఈ హత్యకు కుటుంబీకుల సహకారం ఉండటంతో వారి పై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్టు చెప్పారు. ఈ సంద ర్భంగా కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ రోహిణి అభినందించారు.