Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో సెట్స్ తేదీల వెల్లడి
- కన్వీనర్ల సమావేశంలో ఉన్నత విద్యామండలి నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ సహా వివిధ వృత్తి విద్యా, ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలను పారదర్శకంగా, సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. బుధవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి సెట్ల కన్వీనర్లతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రవేశ పరీక్షలను నిజాయితీగా, విజయవంతంగా నిర్వహించాలని కన్వీనర్లకు సూచించారు. విద్యార్థులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సెట్ల కమిటీలను నియమించి త్వరలోనే సమావేశాలను నిర్వహించి ప్రవేశ పరీక్షల తేదీలు, షెడ్యూల్‌ను విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంసెట్ కన్వీనర్ బి డీన్‌కుమార్, ఈసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేశ్, ఐసెట్ కన్వీనర్ పి వరలక్ష్మి, పీజీఈసెట్ కన్వీనర్ బి రవీంద్రరెడ్డి, లాసెట్ కన్వీనర్ బి విజయలక్ష్మి, ఎడ్‌సెట్ కన్వీనర్ ఎ రామకృష్ణ, పీఈసెట్ కన్వీనర్ రాజేష్‌కుమార్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.