Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో ప్రభుత్వం వాదన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజిలతో కూడిన ధర్మాసనం బుధవారం ప్రకటించింది. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చేయడం ఆ పార్టీకి పరిపాటి అని ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్‌దవే వాదించారు. దేశంలో ఇప్పటివరకు ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని చెప్పారు. ఇవన్నీ ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలేనని వివరించారు. కుట్రలకు బీజేపీ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రయత్నం చేసే ప్రతిపక్షాల పట్ల బీజేపీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజాతీర్పును కాలరాస్తూ ప్రభుత్వాల కూల్చివేతలకు పాల్పడుతున్నదనీ, ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ తమ వాళ్లను పంపిందన్నారు. నిందితులతో సంబంధం లేదని చెప్పే బీజేపీ ముందుగా హైకోర్టుకు వచ్చి సిట్ దర్యాప్తు వద్దని కోరిందన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు సంబంధించిన అనేక ఆధారాలు న్యాయమూర్తి వద్ద ఉన్నప్పటికీ వాటిని ప్రామాణికంగా తీసుకోకుండా సీబీఐ దర్యాప్తనకు ఉత్తర్వులు ఇవ్వడం దారుణమన్నారు. సీబిఐ దర్యాప్తు తీర్పును రద్దు చేయాలని కోరారు. సిట్ దర్యాప్తు జరిగేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. సిట్‌ను రద్దు చేసి సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం, సిట్, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వేసిన అప్పీళ్లపై బుధవారం వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వులో పెడుతున్నట్టు హైకోర్టు ప్రకటించింది.