Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్ద ఎత్తున బ్లాక్ మనీ కలిగి ఉన్నట్టు ఆధారాలు
- పొద్దుపోయేంత వరకు కొనసాగుతూనే ఉన్న సోదాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : నగరంలో పేరు మోసిన ప్రముఖ బిల్డర్స్ ఇండ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖాధికారులు బుధవారం ఆకస్మిక సోదాలు జరిపారు. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో నగరంలోని ఆదిత్య, సీఎస్కే, ఊర్జిత బిల్డర్స్ యాజమాన్యాల ఇండ్లతో పాటు కార్యాలయాల్లో సోదాలను ప్రారంభించారు. ఐటీకి చెందిన 30కి పైగా ప్రత్యేక బృందాలు జూబ్లిహిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లోని సదరు బిల్డర్స్ కార్యాలయాల్లో ఉదయం ఆరు గంటల నుంచే సోదాలను ప్రారంభించారు. ముఖ్యంగా, ఆదిత్య, సీఎస్కే బిల్డర్స్‌కు చెందిన ప్రధాన కార్యాలయాలతో పాటు వాటి అనుబంధ సంస్థలకు చెందిన కార్యాలయాల్లోనూ ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. అంతేగాక, ఆదిత్య హోమ్స్‌కు చెందిన ఎండీ కోటారెడ్డి, ఆయన కుమారుడు ఆదిత్యకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా వారి కార్యాలయాల్లోని అకౌంట్స్ అధికారులను దగ్గరుంచుకొని మరీ ఆదాయపు పన్ను చెల్లింపుల వివరాలను, వాటికి సంబంధించిన ఫైళ్లను ఐటీ అధికారులు పరిశీలించారు. ముఖ్యంగా, ఇండ్ల నిర్మాణాల సందర్భంగా వాటిని ఖరీదు చేసినవారి నుంచి భారీ మొత్తంలో నల్లధనాన్ని కూడా బిల్డర్స్ స్వీకరించినట్టు ఐటీ అధికారులు ఆధారాలను సేకరించినట్టు సమాచారం.