Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్‌తో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదో చెప్పాలి
- కాంగ్రెస్ చేసిన అభివృద్ధిపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా? : టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మోడీతో సీఎం కేసీఆర్‌కు వైరం ఉన్నట్టు బీఆర్ఎస్ బహిరంగ సభ వేదిక మీది నుంచి నమ్మంచే ప్రయత్నం చేశారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆయన ఉపన్యాసం వింటే అది అనిపిస్తున్నదని విమర్శించారు. మోడీని ఓడించాలనుకుంటే గుజరాత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. యూపీలో అఖిలేష్‌ను గెలిపించేందుకు ఏం చేశారనీ, ఢిల్లీలో మీ వ్యాపార భాగస్వామి కేజ్రీవాల్ పార్టీని గెలిపించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. 'కాంగ్రెస్ ఏం చేసిందో...బీజేపీ ఏం చేసిందో...కేసీఆర్ ఏం చేశారో తేల్చుకుందాం. ప్రజల ముందు నిలబడదాం' రావాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ నేతలు జి. చిన్నారెడ్డి, మల్లు రవి, బలరాం నాయక్, గడ్డం ప్రసాద్ కుమార్, సురేష్ షెట్కర్, వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, వెంకట్, రంగారెడ్డి, సిరిసిల్ల రాజయ్యలతో కలిసి రేవంత్ విలేకర్లతో మాట్లాడారు. బహిరంగ సభకు హాజరైన వారంతా ఒక బృహత్ ప్రణాళికతో ముందుకు వస్తారని ఆశించామనీ, చివరకు కాంగ్రెస్, బీజేపీలను కలిపి విమర్శించే ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. దేశంలో రైతుల కోసం ప్రాజెక్టులు నిర్మించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం, బీసీలకు 30శాతం రిజర్వేషన్లు కల్పించింది కూడా కాంగ్రెస్సేనన్నారు. మోడీ అమ్ముకుంటున్న సంస్థలను స్థాపించింది ఎవరో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటున్న మోడీకి పార్లమెంట్లో ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయంపై నిజ నిర్ధారణ కమిటీ వేయడానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఇప్పటికీ సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో మంచి నీళ్లు అందని గ్రామాలెన్నో ఉన్నాయని తెలిపారు. కాలువల ద్వారా నిజంగా నీళ్లిస్తే...ఎనిమిదేండ్లలో రైతులు 25 లక్షల పంపుసెట్లు ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నిం చారు. గత ప్రధానులందరూ కలిపి రూ. 50 లక్షల కోట్ల అప్పులు చేస్తే, మోడీ అధికారంలోకి వచ్చాక రూ. 100 లక్షల కోట్లు అప్పు చేశారని గుర్తు చేశారు. అలాంటి మోడీతో కాంగ్రెస్‌ను పోల్చడం కేసీఆర్ దుర్మార్గానికి పరాకాష్ట అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ 130 సీట్లు గెలుస్తుందని నివేదికలు చెబుతున్నాయనీ, కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక నేతను లొంగ దీసుకునేందుకు రూ 500 కోట్ల ఆఫర్ ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆ రాష్ట్రంలో 25 నుంచి 30 స్థానాల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఆయనతో బేరసారాలు చేసింది నిజం కాదా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్ నిజ స్వరూపం తెలిసే కుమారస్వామి సభకు హాజరు కాలేదన్నారు. కేసీఆర్ వ్యూహాత్మకంగానే డిసెం బర్లో జరపాల్సిన శీతాకాల అసెంబ్లీ సమావేశాల ను నిర్వహించలేదనీ, ఫిబ్రవరి చివరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.