Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ, పంజాబ్ సీఎంల పూజలు
- ఘనస్వాగతం పలికిన అధికారులు
- పోలీసుల భారీ బందోబస్తు
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్ దర్శించుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో వారితోపాటు కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా గుట్టకు వచ్చారు. పినరయి విజయన్, డి.రాజా ప్రెసిడెన్సీ షూట్లో ఉండి అక్కడి నుండే గుట్ట నిర్మాణాన్ని పరిశీలించారు. ఆలయం వద్ద సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్ సింగ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదమంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు ఆశీర్వచనం చేశారు. స్వామి వారి ఫొటోలు, తీర్థప్రసాదాలు వారికి బహూకరించారు. యాదాద్రి విశేషాలను ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి వివరించారు. వీరి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 1600మందితో బందోబస్తు చేపట్టారు. ఆర్జిత సేవలతోపాటు దర్శనాలకు సందర్శకులను అనుమతించలేదు. ఉదయం 11.10 నిమిషాలకు గుట్టకు వచ్చిన ముఖ్యమంత్రులు 12.50కి ఖమ్మం బయల్దేరారు. వారి వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, జిల్లా ప్రజాపరిషత్ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీి సంతోష్, కలెక్టర్ పమేలా సత్పతి ఉన్నారు.