Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫాసిస్టు సిద్ధాంతాన్ని అనుసరించే పార్టీ బీజేపీ
- ఎన్నికలప్పుడే సీట్లు, ఓట్లు, పోటీల గురించి..
- ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించాలి.. : బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, కూనంనేని
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బీఆర్ఎస్ లక్ష్యం వచ్చే ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించి, గద్దె దించడమేనని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇప్పటికే ప్రకటించడం వల్లనే ఆ పార్టీకి మద్దతు ఇచ్చామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. పార్టీ పేరు చూసో.. నాయకుని బొమ్మ చూసో సమర్థించడం, వ్యతిరేకించడం తమ పార్టీకి అలవాటు లేదని, ఆ పార్టీ ప్రకటించే విధానాన్ని బట్టి సీపీఐ(ఎం) నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఖమ్మం నూతన కలెక్టరేట్ వెనుక బుధవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో తమ్మినేని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. బీజేపీ అనేది ఓ సాదాసీదా రాజకీయ పార్టీ కాదని.. దేశంలో బలహీనపడుతున్న చాతుర్వర్ణ, కులవ్యవస్థను పున:ప్రతిష్టించడంతో పాటు దేశంలో అమల్లో ఉన్న రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ లక్ష్యమని తెలిపారు. అలాంటి బీజేపీ అధికారంలో ఉండకూడదనే లక్ష్యం, రాజకీయ విధానాన్ని సీపీఐ(ఎం) కలిగి ఉందని స్పష్టంచేశారు. దానికనుగుణంగానే గతేడాది నుంచి రాష్ట్రంలో కేసీఆర్కు, బీజేపీకి వ్యతిరేక పోరాటం జరుగతుందన్నారు. రాష్ట్రాల హక్కులు, రాజ్యాంగం నిలపడం కోసం, విద్యుత్ చట్టానికి వ్యతిరేక పోరాటం వంటివాటిలో తెలంగాణ ప్రభుత్వం పటిమ హర్షనీయమన్నారు. అందుకే సీపీఐ(ఎం) బీఆర్ఎస్ను సమర్థిస్తోందన్నారు. ఎన్నికలు, పొత్తులు, సీట్లు, ఏ సీటు, ఎవరు పోటీ వంటివన్నీ ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చని తెలిపారు. రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ అడుగుపెట్టనీయబోమని, వాళ్ల అడుగు ఊడేంత వరకూ కమ్యూనిస్టులు నిద్రపోరన్నారు. జిల్లాలో అనేక ఏండ్లుగా నెలకొన్న సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించాలని కోరారు. దుమ్ముగూడెం సాధన కోసం రాజశేఖరరెడ్డి హయాంలో 2,600 కి.మీ పాదయాత్ర చేశానని, ప్రాజెక్టు వచ్చినా నిధులు మంజూరు కాలేదన్నారు. ఆ తర్వాత దాని పేరుమార్చి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, సాగులో ఉన్న భూములకు ఫిబ్రవరిలోపు పట్టాలిస్తామన్న సీఎం హామీ నిలుపుకోవాలన్నారు. గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు, భద్రాచలం పట్టణ విభజన రద్దు చేసి ఒకే పంచాయతీగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం ముంపునకు గురికాకుండా కరకట్టల ఎత్తు, పొడవు విస్తరించాలన్నారు. ఖమ్మంలో యూనివర్శిటీ ఏర్పాటు చేయాలన్నారు. గ్రానైట్ పరిశ్రమను కాపాడాలన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు హాజరైన లక్షలాది ప్రజానీకానికి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు యోధులు జన్మించిన తెలంగాణ గడ్డపై బీజేపీకి చోటులేదన్నారు. ప్రపంచంలో హిట్లర్ నియంతలా పేరొందారని.. ఇప్పుడు ప్రధాని మోడీ హిట్లర్నే మించిపోయారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను మింగేస్తుందని, ఇప్పటికే 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేసిందని తెలిపారు. మోడీ అబద్దాలు పలకడంలో దిట్టగా మారారని, ఆయనకు నార్కో పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీకి దేశం, రాజ్యంపై ప్రేమ లేదని, ఆయన ప్రేమ అంతా అంబానీ, అదానీలపై మాత్రమేనన్నారు. గాంధీ జపం చేస్తూనే గాడ్సేలకు గుడి కడతారని విమర్శించారు. భారతదేశ సమాజంలో నాల్గవ వంతు ముస్లింలు ఉన్నారని హిందూ, ముస్లిం సహా అన్ని మతాల వారు అన్నదమ్ముల్లా మెలుగుతున్న దేశం మనదన్నారు. రైల్వేలు, సింగరేణి, ఎల్ఐసీ సహా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.