Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2024లో కేంద్రంలో విపక్షాల ప్రభుత్వం
- బీజేపీది ప్రయివేటైజేషన్.. మాది నేషనలైజేషన్ విధానం
- అధికారంలోకి వస్తే అగ్నిపథ్ రద్దు
- దేశమంతా ఉచిత విద్యుత్, రైతుబంధు, దళితబంధు అమలు చేస్తాం : ఖమ్మం బహిరంగసభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్
- మతతత్వం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం : విజయన్
- గవర్నర్లను ఆడిస్తున్నది మోడీనే : కేజ్రీవాల్
- ప్రజాస్వామ్యంపై బీజేపీకి విశ్వాసం లేదు : భగవంత్‌సింగ్ మాన్
- బీజేపీని ఓడించడమే అందరి కర్తవ్యం : డి రాజా
- మోడీకి కౌంట్‌డౌన్ షురూ : అఖిలేష్‌యాదవ్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తొలి బహిరంగ సభ ఖమ్మంలో అట్టహాసంగా జరిగింది. భారీ సంఖ్యలో ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన సభలో కేరళ, డిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌సింగ్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రధాన వక్తలుగా మాట్లాడారు. 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యమని నేతలంతా ప్రకటించారు. 8 ఏండ్ల మోడీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, విజృంభిస్తున్న మతోన్మాదం, అధికారం కోసం బీజేపీ తొక్కుతున్న అడ్డతోవలు సహా పలు అంశాలను ప్రస్తావించారు. మతోన్మాద బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశానికి దశా, దిశా తాము అందిస్తామని స్పష్టం చేశారు.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో 2024లో పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని మోడీ ఇంటికే వెళ్తారని భారత రాష్ట్ర సమితి (అధినేత), ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో విపక్షాల ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఖమ్మంలో బుధవారం భారీ బహిరంగసభను నిర్వహించారు. ఆ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలొచ్చారు. కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవరావు, నామా నాగేశ్వరరావు, మంత్రులు టి హరీశ్‌రావు, పువ్వాడ అజరుకుమార్, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మెన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 'బీజేపీ చెప్పే నీతి సోషలైజ్ ది లాసెస్.. ప్రయివేటైజ్ది ప్రాఫిట్. ఇది దుర్మార్గమైన దోపిడీదారుల ప్రభుత్వం. పెట్టుబడిదారుల కోసమే పనిచేస్తున్నది. బీజేపీది ప్రయివేటైజేషన్... మాది నేషనలైజేషన్ విధానం. మోడీ ఎల్ఐసీని ప్రయివేటుపరం చేస్తా అంటున్నారు. అమ్మేరు పర్వాలేదు. 2024 తర్వాత నువ్వు ఇంటికి.. మేం ఢిల్లీకి. గ్యారంటీగా ఎల్ఐసీని ప్రభుత్వరంగంలోకి తిరిగి తీసుకొస్తాం. ఎల్ఐసీకి రూ.42 లక్షల కోట్ల ఆస్తులున్నరు. లక్షలాది మంది ఏజెంట్లు, ఉద్యోగులున్నారు. కానీ అప్పనంగా ఇష్టమొచ్చినట్టు షావుకార్లకు అమ్ముతామని ఉవ్విళ్లూరుతున్నవ్. ఎల్ఐసీ కార్మికులు, మిత్రులు సింహాల్లా గర్జించండి. బీఆర్ఎస్ను బలపరచండి. ఎల్ఐసీని రక్షించుకుందాం'అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
మరో ఉద్యమానికి సిద్ధం'విద్యుత్ రంగాన్ని ప్రభుత్వరంగంలోనే ఉంచుతాం.. ఇదే బీఆర్ఎస్ విధానం. కరెంటు కార్మికులారా.. పిడికిలి బిగించాలి. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో నిండా నీళ్లున్నా.. మంచినీళ్లివ్వలేని అసమర్థ పాలకులు కావాలా?. కరెంటు ఇవ్వరు. మంచినీళ్లివ్వరు. జలవిద్యుత్‌లో లక్ష మెగావాట్లను ఉత్పత్తి చేసే అవకాశమున్నది. దేశంలో కోసి, గండకీ నదులు పారుతున్నా కరువు, వరదలతో బీహార్ ఉన్నది. సువిశాల భారతదేశంలో ఒక్క ప్రాజెక్టు ఉందా?. ఇది ప్రశ్నించడానికి, చైతన్యం తేవడానికి పుట్టిందే బీఆర్ఎస్. ఆరునూరైనా తెలంగాణ ఉద్యమం తరహాలో భారతదేశంలో ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. పాలకులతో కొట్లాడతాం. బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాచాలా?. వాటిపై సినిమాలు వచ్చినా మనకు సిగ్గు రాదా?. 'సట్లెజ్ ఉప నదులపై పంజాబ్, హర్యానా తన్నుకుంటరు. మహానది నీళ్లు గురించి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, నర్మద జలాల కోసం గుజరాత్, మధ్యప్రదేశ్, కావేరి జలాల కోసం తమిళనాడు, కర్నాటక, గోదావరి నది మీద మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర పంచాయితీ. రాష్ట్రాల మధ్య కేంద్రం కొట్లాట పెడుతున్నది. డొల్ల మాటలు చెప్పే పరిపాలకులు కావాలా? నిజాయితీగా పనిచేసే వారు కావాలా?. మన కాళేశ్వరం కాలేదా?, పాలమూరు అవుతున్నది. సీతారామ ఖమ్మంలో పరుగులు పెడుతున్నది. కష్టాల నుంచి భారత జాతిని విముక్తి చేసేందుకే బీఆర్ఎస్. ఈ దుర్మార్గాలకు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే కారణం. ఆ రెండు పార్టీలూ దొందూదొందే. సామాన్యుల గొంతు తడవాలా? ప్రజల పంటపొలాలు పండాలా?. దేశంలో నాలుగు లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కానీ ఏనాడూ 2.10 లక్షల మెగావాట్లకు మించి వాడలేదు. దేశంలో ఎక్కడా 24 గంటల ఉచిత విద్యుత్ అమలు కావడం లేదు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేండ్లలో వెలుగుజిలుగుల భారత్‌ను నిర్మిస్తాం. రైతులకు ఉచిత్ విద్యుత్ అందిస్తాం. దీనికయ్యే ఖర్చు రూ.1.45 లక్షల కోట్లు. కానీ మోడీకి ఇష్టమున్న పెట్టుబడిదారులకు ఎన్పీఏల పేరుతో రూ.11 లక్షల నుంచి రూ.14 లక్షల కోట్లు ఇచ్చారు. రైతు ఆత్మహత్యలు సిగ్గుచేటు. రైతుబంధు అమలు చేస్తాం. తెలంగాణ మోడల్‌ను దేశమంతా అమలు చేస్తాం. 'అని కేసీఆర్ అన్నారు.
సంపద ఉన్నా యాచకులం ఎందుకు
'కెనడా నుంచి కంది పప్పు, రూ.లక్ష కోట్ల విలువైన పామాయిల్‌ను దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. భారతదేశం లక్ష్యాన్ని కోల్పోయిందా?, దారి తప్పిందా?. ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకునే అవసరం లేదు. అమెరికా కాళ్లు మొక్కాల్సిన పనిలేదు. విశీయుల సహాయం వద్దు. దేశంలోని సహజ సంపద ప్రజల సొత్తు. సంపద ఉండి కూడా ఎందుకు యాచకులం కావాలి. భారతదేశ భూభాగం ఎకరాల్లో 83 కోట్ల ఎకరాలు. ఇందులో 41 కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలం. 1.40 లక్షల టీఎంసీల నీరుంది. ఇందులో 75 శాతం ఆవిరైపోతే, 75 వేల టీఎంసీలు వినియోగించుకోవచ్చు. కానీ మనం వాడుతున్నది 19 లేదా 20 టీఎంసీలు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కొన్ని ప్రాజెక్టులు కట్టాం. ఇప్పుడు ఆ ఊసేలేదు. ఉమ్మడి రాష్ట్రంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వేశారు. 19 ఏండ్లు గడిచింది. ఉలుకూ పలుకూ లేకపోతే తీర్పు వచ్చేదెప్పుడు, డిజైన్లు అయ్యేదెప్పుడు, ప్రాజెక్టులు కట్టేదెప్పుడు, ప్రజలకు సాగు, తాగునీరు అందించేదెప్పుడు. నీళ్లిచ్చేందుకు చాతకాదు. ప్రజలను మాత్రం గోల్మాల్ చేస్తున్నారు. మతవిద్వేషాలను పెంచి రెచ్చగొడుతున్నారు. దేశంలో భూమి, నీరుంది. పంటలు పండేందుకు అద్భు తమైన సూర్యరశ్మి ఉంది. దేశంలో ఆపిల్‌తోపాటు మామిడి పండ్లు పండు తాయి. ఇన్ని ఉన్న దేశంలో పిజ్జాలు, బర్గర్లా మనం తినేది. అద్భుతమైన పంటలు పండిం చి, సాగునీరు అందించి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండిస్టీలు పెట్టాలి. కోట్లాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. బెస్ట్ ఫుడ్ ఆఫ్ చైన్‌గా ఉండాలి.'అని కేసీఆర్ అన్నారు.
సీపీఐ, సీపీఐ(ఎం)తో కలిసి పనిచేస్తాం
'దళితులు ఎవరి కోసం వివక్ష అనుభవించాలి? అందుకే పుట్టింది దళితబంధు పథకం. అంబేద్కర్, కాన్షీరాం బాటలో దళిత జాతి పైకి వచ్చి తీరాలి. దళితబంధు పథకాన్ని ఏటా 25 లక్షల కుటుంబాల చొప్పున దేశమంతా అమలు చేయాలి. మీరు చేయకపోతే మేం చేసి చూపిస్తాం. లింగ వివక్ష పోవాలి. మహిళల పాత్రను అన్నిరంగాల్లో పెంపొందించాలి. మహిళలకు 35 శాతం చట్టసభల్లో రిజర్వేషన్లు ప్రతిపాదిస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటుపరం చేస్తామంటున్నారు. మళ్లీ ప్రభుత్వరంగంలోకి తెస్తాం. వ్యవసాయాన్ని సైతం ప్రయివేటీకరణ చేసి మన భూముల్లోనే జీతాలకు ఉండే పరిస్థితిని తెచ్చేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. అధికారంలోకి వస్తే అగ్నిపథ్‌ను కూడా రద్దు చేస్తాం. పాత పద్ధతిలోనే సైనికుల నియామకాలుంటాయి. అసమర్థతను, చాతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు మత విద్వేషపు మంటలు రేపుతున్నారు. ఉజ్వలమైన భారత్‌ను ఆవిష్కృతం చేసుకునేందుకు బీఆర్ఎస్ ఆవిర్భవించింది. త్వరలోనే బీఆర్ఎస్ విధానాన్ని ప్రజల ముందుంచుతాం. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, మాజీ జడ్జీలు 150 మంది వరకు పనిచేసున్నారు. సీపీఐ, సీపీఐ(ఎం) సహా ప్రగతిశీల పార్టీలతో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కలిసి పని చేస్తుంది. అంతిమ విజయం మనదే. ఈ సభ దేశంలో ప్రబలమైన మార్పునకు సంకేతం కావాలి'అని కేసీఆర్ చెప్పారు.
ప్రజలను విభజించేందుకే సీఏఏ : పినరయి విజయన్
ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా మారిందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ప్రజలను విభజించడం కోసమే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను కేంద్రం తెచ్చిందన్నారు. దేశాన్ని కులం, మతం పేరుతో నిలువునా చీలుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టి విదేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. దేశ సమగ్రతను, న్యాయాన్ని, హక్కులను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికతత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వైఖరితో లౌకికత్వం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల సమ్మేళనమే భారతదేశమని వివరించారు. కానీ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులు, అధికారాలను కేంద్రం కాలరాస్తున్నదని విమర్శించారు. కీలక నిర్ణయాల్లో రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి పాలిస్తున్నాయని విమర్శించారు. గవర్నర్ల వ్యవస్థను రాజకీయం కోసం వాడుకుంటున్నాయని చెప్పారు. గవర్నర్ల ద్వారా రాష్ట్రాలను నియంత్రించేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని అన్నారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నిస్తున్నదని గుర్తు చేశారు. చర్చలు జరగకుండానే చట్టసభల్లో బిల్లులను బలవంతంగా ఆమోదిస్తున్నారు. మాతృభాషను చంపే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలన్నారు. మతతత్వం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
గవర్నర్లను ఆడిస్తుంది మోడీనే...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్దేశంలో గవర్నర్లు ప్రజా ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు. వారిని ఆడిస్తున్నది ప్రధాని మోడీనే. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న చోట్ల గవర్నర్లు బీజేపీ కార్యకర్తలుగానే వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. తెలంగాణలో అమలవుతున్న కంటి వెలుగు మంచి కార్యక్రమం. రాష్ట్రంలోని 4 కోట్ల మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి, మందులు, ఆపరేషన్లు చేస్తున్నారు. దీన్ని తెలంగాణ నుంచి మేం నేర్చుకుంటున్నాం. మా రాష్ట్రాల్లోనూ అమలు చేస్తాం. అలాగే తెలంగాణలోని 33 జిల్లాల్లో 17జిల్లాల్లో సమీకృత కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండటం సామాన్యులకు ఉపయోగం. దేశంలో మంచి పనులను ఒకరినుంచి మరొకరు నేర్చుకోవాలి. ఢిల్లీలో మేం మొహల్లా క్లినిక్స్ ఏర్పాటు చేశాం. పంజాబ్‌లోనూ ఏర్పాటు చేశాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మా మొహల్లా క్లినిక్స్ చూడడానికి వచ్చారు. బస్తీ దవాఖానా పేరుతో ఇక్కడ ఏర్పాటు చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఢిల్లీ వచ్చి స్కూళ్లు చూసి, తమ రాష్ట్రంలో దాన్ని అమలు చేస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటింది. ఇంకా ఎందుకు వెనకబడి ఉన్నాం? మన దేశంలోని రాజకీయనేతలు సక్రమంగా లేరు. నేను 10వ తరగతి చదివేటప్పుడు కేరళలో స్కూళ్లు, వైద్యం బాగుంటాయనిచదువుకున్నా. మరి దేశవ్యాప్తంగా అవి ఎందుకు బాగాలేవు.మంచి చేస్తున్న ప్రతిపక్షపార్టీల ప్రభుత్వాలను ఎలా ఇబ్బందులు పెట్టాలనే లెక్కలు వేసుకొనే ప్రధాని, దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు. ఉదయం లేచినదగ్గరి నుంచి ఏ ముఖ్యమంత్రిని ఎలా ఇబ్బంది పెట్టాలి...ఎక్కడ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి అనే ఆయన ఆలోచిస్తూ ఉంటారు. దేశాన్ని బర్బాద్ చేస్తున్నారు. 2024లో బీజేపీ ప్రభుత్వాన్ని తిరస్కరించాలి. ప్రజలు తమ పిల్లల చదువు, విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాల కోసం ఆలోచించాలి.
ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు. ప్రజలు తిరస్కరించినచోట్ల అడ్డదారుల్లో బై ఎలక్షన్లు తేవడం, గెలవలేకపోతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ లోక్తంత్ర పార్టీ కాదు. లూట్తంత్ర పార్టీ. దేశాన్ని అన్నిరంగాల్లోనూ లూటీ చేస్తుంది. బీజేపీ అంటే...భారతీయ జుమ్లా పార్టీ. ఎవరైనా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాలి. లాక్కుంటే, కొనుక్కుంటే రాదు. 8 ఏండ్లుగా ఎర్రకోటపై ప్రధాని చేసే ప్రసంగం ఒకే తరహాలో ఉంటుంది. ఎప్పుడూ ఉపాధి, నిరుద్యోగం గురించే మాట్లాడతారు. ఆ సమస్యలు అధిగమించొద్దని ఎవరు అడ్డుపడ్డారు. దేశంలో కార్పొరేట్ దోపిడీ రాజ్యమేలుతుంది. నదులు, ఎల్ఐసీ, రైల్వే, ఎయిర్‌పోర్టులు సహా అన్నీ అమ్మేస్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న కంటివెలుగు కార్యక్రమం బాగుంది. మా రాష్ట్రంలో అమలు చేస్తాం. మంచిని ఎక్కడినుంచైనా నేర్చుకోవచ్చు. కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదు. ప్రభుత్వాల ఏర్పాటులో ఎంపీలు, ఎమ్మెల్యేలు తక్కువైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకోవచ్చనే ధీమాలో బీజేపీ ఉంది. 'తక్కువ ధరకు ఎమ్మెల్యేలను అమ్ముతాం' అని కాంగ్రెస్ బోర్డు పెట్టుకోవాలి.
బీజేపీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యం : డి రాజాబీజేపీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా పిలుపునిచ్చారు. మోడీ పాలనలో దేశం అతిపెద్ద సంక్షోభంలో ఉందనీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. దేశంలో లౌకికతత్వం ప్రమాదంలో పడిందన్నారు. భారత్ హిందూ దేశంగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా దేశాన్ని విచ్ఛిన్నం చేయలేదని చెప్పారు. కేంద్రం విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అంశాలను విస్మరిస్తున్నదని చెప్పారు. మోడీ సర్కారు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నదని విమర్శించారు. పేదలు, రైతుల పక్షాన కాకుండా అదానీ, అంబానీ కోసమే ప్రధాని పనిచేస్తున్నారని అన్నారు. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందనీ, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో గవర్నర్లు హద్దుమీరుతున్నారని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్పై ఐక్య పోరాటానికి ఖమ్మం బహిరంగసభ నాంది కావాలన్నారు.
కేంద్రంలో కౌంట్‌డౌన్ షురూ...
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్
ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని, ప్రశ్నించే వ్యక్తులు, పార్టీలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల ద్వారా దాడులు చేయిస్తూ, భయపెట్టి అధికారాన్ని కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నదని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీకి 400 రోజులే అధికారం ఉందనీ, దానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని చెప్పారు. దేశంలో యువతరానికి ఉద్యోగాలు, ఉపాధి లేవనీ, నిరుద్యోగం పెరిగి, రాష్ట్రాల మధ్య ప్రజలు వలసలు వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ, ఇప్పుడు వారినే శత్రువులుగా చూస్తున్నారని చెప్పారు. రొటేషన్ ప్రకారం జీ-20 దేశాల సదస్సుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం భారతదేశానికి వచ్చిందనీ, దాన్ని కూడా రాజకీయంగా వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గంగానది ప్రక్షాళన ఏమైందో తెలీకుండా పోయిందన్నారు. ప్రజోపయోగ పనులు చేసే సత్తా లేని బీజేపీ, ఆ పనులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను అడ్డుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బీజేపీ దేశాన్ని ఓ తరం వెనక్కి తీసుకెళ్లిందనీ, ఆపార్టీని గద్దె దింపేందుకు భావసారూప్య పార్టీలన్నీ ఏకం కావాలని అభిలషించారు. పలు రాష్ట్రాల్లో కొందరు నాయకులు ఏం చేయకుండానే ప్రచారార్భాటం మాత్రం చేస్తున్నారని అన్నారు. దేశంలో కొత్త రాజకీయపార్టీల అవసరం ఉన్నదనీ, బీజేపీతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.