Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నిజామాబాద్ బార్ అసోసియేషన్ చైర్మెన్ ఎర్రం గణపతిపై అక్కడి రూరల్ పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 23న నిర్వహించబోయే తదుపరి విచారణలోగా వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎన్బీఏ అధ్యక్షుడు గణపతిపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఆయనతోపాటు హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా చీఫ్ జస్టిస్‌ను కోరారు. గణపతి రాసిన లెటర్‌ను హైకోర్టు రిట్‌గా స్వీకరించింది. భూమి పరిహార వివాద కేసు విషయంలో నిజామాబాద్ జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి అటాచ్మెంట్ ఎగ్జిక్యూట్ వారెంట్‌ను జారీ చేశారు. ఆ ఆర్డర్ కాపీని అందజేసేందుకు గణపతి కలెక్టరేట్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడి ఏఓ ఫిర్యాదు మేరకు గణపతితోపాటు కోర్టు ఉద్యోగి, డిక్రీ హోల్డర్‌పై నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తమపై అక్రమ కేసు బనాయించారంటూ గణపతి సమర్పించిన లేఖపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. చీఫ్ సెక్రటరీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నిజామాబాద్ కలెక్టర్, ఎస్పీ, అడిషనల్ కలెక్టర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు కేసు దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.