Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఎమ్వీ చట్టం'పై కేంద్రానికి హైకోర్టు నోటీసు
నవతెలంగాణ - హైదరాబాద్
రోడ్డు ప్రమాదం జరిగిన ఏడాదిలోపు కింది కోర్టులో దావా వేయాలన్న మోటార్ వెహికిల్ చట్టంలోని నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఆర్నెల్లకు తగ్గించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. వ్యక్తి మరణించిన సందర్భంలో ఆ విషాదం నుంచి కుటుంబం కోలుకోవాలంటేనే ఏడాది సమయం పడుతుందంటూ అభిప్రాయపడింది. ఈ వివాదంపై నివేదిక అందజేయాలంటూ అమికస్క్యూరీగా నియమితులైన న్యాయవాది పి.శ్రీరాఘురామ్ను ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శి, నిజామాబాద్ మోటార్ యాక్సిడెంట్ క్లయిమ్స్ ట్రిబ్యునల్ చైర్మన్లను ఆదేశించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ విచారణను ఫిబ్రవరి రెండుకి వాయిదా వేసింది. రోడ్డు ప్రమాదంలో కుటుంబంలోని వ్యక్తి మరణించడంతో నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం అమ్రాడ్ గ్రామానికి చెందిన ఎ. నవనీత అక్కడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.